రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు భారీ ఝలక్‌! రేసు నుంచి మరొకరు అవుట్‌

18 Jun, 2022 16:10 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపిక కసరత్తులో ఉన్న విపక్షాలకు భారీ ఝలక్‌ తగిలింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా(84) రేసు నుంచి తప్పుకున్నారు. తాను వైదొలుగుతుండడంపై శనివారం మధ్యాహ్నాం స్వయంగా ఆయన ప్రకటించడం విశేషం.  

ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ను విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో షాక్‌ తగిలింది. జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా సైతం రేసు నుంచి తప్పుకున్నారు.  ‘‘జమ్ము కశ్మీర్‌ ఒక క్లిష్టమైన ఘట్టం గుండా వెళుతోంది. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. నా సేవలు స్వరాష్ట్రానికి అవసరం అని భావిస్తున్నా. అందుకే రాష్ట్రపతి రేసు నుంచి మర్యాదపూర్వకంగా వైదొలుగుతున్నా’’ అని తెలిపారాయన. జమ్ము రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ సేవలో సానుకూల సహకారం అందించడానికి సిద్ధంగానే ఉన్నా అంటూ ప్రకటించారు ఫరూఖ్‌ అబ్దుల్లా.

అంతేకాదు.. తన పేరును రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల ఉమ్మడి ప్రతిపాదన చేసిన మమతా బెనర్జీకి, ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారాయన. రేసు నుంచి వైదొలిగినా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. 

ఇదిలా ఉంటే.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం జూన్‌ 15వ తేదీన మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు సమావేశం అయ్యాయి. అయితే శరద్‌ పవార్‌ ఆసక్తి చూపించకపోవడంతో.. రేసులో ఫరూఖ్‌ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచాయి. జూన్‌ 21న మరోసారి భేటీ అయ్యి.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఓ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. లిస్ట్‌లో ఉన్న ఫరూఖ్‌ అబ్దుల్లా తప్పుకోవడం గమనార్హం.  ఇక విపక్షాల జాబితాలో మిగిలింది గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే.

చదవండి: మరీ ఇంత నిర్లక్ష్యమా? విపక్షాలపై సేన విసుర్లు

మరిన్ని వార్తలు