రాష్ట్రపతి ఎన్నికలు.. బాబును పట్టించుకోని ప్రధాని మోదీ

12 Jul, 2022 10:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆదివాసీ మహిళ ముర్ముకు ఓటేయాలని సోమవారం జరిగిన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. ముర్ముకు మద్దతు ఇచ్చి సామాజిక న్యాయం కోసం ముందు వరుసలో నిలబడినట్లు చెప్పారు. టీడీపీకి అసెంబ్లీలో ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలు (23 మందిలో నలుగురు ఆ పార్టీకి దూరమయ్యారు), రాజ్యసభలో ఒకరు, లోక్‌సభలో ముగ్గురు సభ్యుల బలం ఉంది. ఈ నెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వీరంతా ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు ఓటేయనున్నారు. 

చంద్రబాబును పిలవని మమత 
జాతీయ రాజకీయాల్లో టీడీపీ జీరోగా మారడంతో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు. ఎన్డీఏతోపాటు ప్రతిపక్ష పార్టీలకు నేతృత్వం వహించిన మమతా బెనర్జీ కూడా ఆయన్ని లెక్కలోకే తీసుకోలేదు. దేశంలోని చిన్నాచితక పార్టీల మద్దతు అడిగిన మమత చంద్రబాబును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన్ని నమ్మే పరిస్థితి లేకపోవడంతోనే మమతా బెనర్జీ, ఇతర విపక్ష నేతలు మాట మాత్రమైనా తమకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబును అడగలేదని చెబుతున్నారు.

గత సాధారణ ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి యూపీఏ కూటమిలోకి ఫిరాయించడం, ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక యూపీఏను వదిలేసి మళ్లీ ఎన్డీఏ ప్రాపకం కోసం ప్రయత్నించడంతో విపక్షాలు ఆయన్ని నమ్మడం లేదు. గతంలో కూడా తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఢిల్లీలో లాబీయింగ్‌ చేస్తూ నమ్మదగని నేతగా ఉన్న ఆయన్ని కావాలనే మమత పక్కన పెట్టినట్టు ప్రచారం జరిగింది. అందుకే మమత నేతృత్వం వహించిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సైతం చంద్రబాబు మద్దతు అడగలేదు.  
చదవండి: Andhra Pradesh: మరో రెండ్రోజులు వర్షాలే

దరిచేరనీయకపోయినా ఎన్డీఏకు మద్దతు  
ఇక అధికార ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబును దూరం పెట్టింది. వాస్తవానికి గత ఎన్నికల తర్వాత నుంచి ఆయన మోదీకి దగ్గరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ మోదీ పట్టించుకోవడంలేదు. దీంతో బీజేపీలో ఉండి తన కోసం పనిచేస్తున్న నేతల ద్వారా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. కనీసం మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్రంలో ఎవరితోనైనా చంద్రబాబుకు ఫోన్‌ చేయించేందుకు ఆయన కోవర్టులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

గత ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉన్నట్టుండి బీజేపీని వదిలి మోదీ, అమిత్‌షాలను ఇష్టానుసారం దూషించారు. ఎన్నికల్లో గట్టి షాక్‌ తగలడంతో మళ్లీ వారి ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా మోదీని పొగుడుతూ ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు తీరును గమనించి బీజేపీ ఆయన్ని దరిచేరనీయలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ పట్టించుకోకపోయినా, మద్దతు ఇవ్వాలని అడగకపోయినా స్వయంగా చంద్రబాబే ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించుకోవాల్సివచ్చింది. 

కిషన్‌రెడ్డికి కనకమేడల ఫోన్‌ 
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సోమవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌చేశారు. ‘మేమూ మద్దతిచ్చాం. అభ్యర్థిని కలిసేందుకు పిలవరా’ అని అడిగారు. ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం కోల్‌కత పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ముతో కలిసి కిషన్‌రెడ్డి మంగళవారం విజయవాడకు వస్తారు. ఈ నేపథ్యంలో కనకమేడల ఫోన్‌ చేసినప్పుడు కిషన్‌రెడ్డి తమ అభ్యర్థికి టీడీపీ మద్దతు తెలిపిన విషయం తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. ఈ విషయంపై పెద్దలతో మాట్లాడి చెబుతానని కిషన్‌రెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు