Assembly Elections 2022: బౌండరీ విజయమిది 

11 Mar, 2022 03:59 IST|Sakshi

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలకు ఈ ఫలితాలే ప్రతిబింబం 

ఈసారి హోళీ పదినే వచ్చింది 

పేదల పక్షపాత ప్రభుత్వాలకే ప్రజలు జై కొట్టారు 

నాలుగు రాష్ట్రాల్లో పార్టీ విజయదుందుభిపై ప్రధాని మోదీ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు ఓటేస్తారనడానికి ఈ నాలుగు రాష్ట్రాల ఘన విజయాలే ప్రత్యక్ష నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ విజయతీరాలకు చేరిన నేపథ్యంలో గురువారం రాత్రి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘ప్రగతిశీల ప్రభుత్వాలకు, పేదల పక్షపాత సర్కార్‌కు ప్రజామోదం ఎప్పుడూ ఉంటుందనడానికి ఈ విజయాలే ప్రబల సాక్ష్యాలు. భారత భవ్య భవిష్యత్‌కు ఈ గెలుపు భరోసానిస్తోంది. రెండేళ్లలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలే ప్రతిబింబం. రాజకీయ పండితులు గతంలో విశ్లేషించినట్లు ఉత్తరప్రదేశ్‌లో 2017లో వచ్చిన ఫలితాలు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమయ్యాయి.

అదే రీతిలో ఈరోజు వచ్చిన ఫలితాలు 2024లో పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయనడంలో సందేహమే లేదు. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌.. నాలుగు రాష్ట్రాల్లో గెలిచి బీజేపీ విజయ బౌండరీ కొట్టింది. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించి కార్యకర్తలు ముందే హోళీ పండగ తీసుకొచ్చా రు. కార్యకర్తలకు అభినందనలు. మణిపూర్, గోవా, యూపీల్లో పార్టీ సాధించిన ఓట్ల శాతం పెరిగింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు ఇక ఏదో ఒకరోజున భారత్‌లో తెరపడనుందని కాంగ్రెస్‌ పార్టీనుద్దేశిస్తూ అన్నారు. ఈసారి ఎన్నికల్లో తొలిసారి ఓటర్లు, మహిళా ఓటర్లు కీలకపాత్ర పోషించారన్నారు.  

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు గోవాలో గల్లంతు 
‘దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నా కుల, మత, ప్రాంతీయ రాజకీయాలతో ముడిపెట్టి, అవినీతిపరులను కాపాడేందుకు ప్రయ త్నిస్తున్నారు. అలాంటి వారి నోళ్లను ప్రజలు మూయించాలి’ అని విపక్షపార్టీలను విమర్శించారు. ‘మేం ఏ పార్టీకి, ఏ ఒక్క కుటుంబానికీ వ్యతిరేకం కాదు. అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడమే మాకు ముఖ్యం’ అని అన్నారు.

‘‘కల్లోల ఉక్రెయిన్‌ నుంచి వేలాది మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చాం. ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ‘ఆపరేషన్‌ గంగా’ ప్రక్రియనూ తప్పుబట్టారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన పంజాబ్‌లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతగానో శ్రమించారు.  ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ గోవాలో ఘన విజయం సొంతం చేసుకున్నాం. సుస్థిర ప్రభుత్వాలకు మళ్లీ ఓటేసి ప్రజలు తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరోసారి చాటారు. ఉత్తరప్రదేశ్‌ దేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులను ఢిల్లీకి పంపింది. తొలిసారిగా ఐదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. 37 ఏళ్ల తర్వాత యూపీలో ఇది సాకారమైంది’ అని మోదీ అన్నారు.   

మరిన్ని వార్తలు