మాట నిలబెట్టుకుంటాం

24 Oct, 2021 05:49 IST|Sakshi
బారాబంకీలో యాత్ర ప్రారంభిస్తున్న ప్రియాంక

కొత్త నినాదంతో యూపీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్‌ పార్టీ

ప్రతిజ్ఞా యాత్రలను ప్రారంభించిన ప్రియాంకా గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ‘హమ్‌ వచన్‌ నిభాయేంగే’ (మాట నిలబెట్టుకుంటాం) అనే నూతన నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఏడు వాగ్దానాలను కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రియాంకాగాంధీ వాద్రా శనివారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా యాత్రలను ఆమె  బారాబంకీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూపీలో తాము అధికారంలోకి వస్తే 20 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రైతుల రుణాలను మొత్తం మాఫీ చేస్తామని వెల్ల డించారు. గోధుమలు, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. చెరుకు పంటను క్వింటాల్‌కు రూ.400 ధరతో కొంటామన్నారు. అన్ని రకాల విద్యుత్‌ బిల్లులను సగానికి తగ్గిస్తామన్నారు. అంతేకాకుండా కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం అందజేస్తామని ఉద్ఘాటించారు.  వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామన్నారు.  అధికారంలోకి వస్తే.. 12వ తరగతి  బాలికలకు స్మార్ట్‌ ఫోన్లు, గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న విద్యార్థినులకు ఈ–సూ్కటర్లు ఇస్తామని  ఇంతకు ముందే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ప్రారంభమైన ఈ యాత్ర అవధ్‌లోని బారాబంకీ, బుందేల్‌ఖండ్‌ జిల్లాలను కలుపుతూ ఝాన్సీ వరకు సాగుతుంది.
 

మరిన్ని వార్తలు