కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం

2 Mar, 2021 20:04 IST|Sakshi

డిస్పూర్‌: అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిలిపివేస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఆమె మంగళవారం అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు తేజ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట​ ప్రజలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు.

గత ఐదేళ్లుగా తేయాకు మహిళా కార్మికుల దినసరి వేతనం పెరగటం లేదని మండిపడ్దారు. అయితే తాము అధికారంలోకి వస్తే తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం రూ.365 చేస్తామని ప్రియాంక తెలిపారు. అసోంలో 5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అసోం మహిళల భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకమని తెలిపారు. మహిళలపై అసోంలో చాలా దాడులు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. 126 నియోజవర్గాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికల జరగనున్నాయి.

చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్

మరిన్ని వార్తలు