ఫొటో మోదీది.. బాధ్యత రాష్ట్రాల పైనా?

27 May, 2021 01:33 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌ను ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం వినియోగించకుండా, ప్రధాని మోదీ తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ల మీద మోదీ తన ఫొటో వేసుకుంటున్నారని, కానీ వ్యాక్సినేషన్‌ బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వదిలేశారని దుయ్యబట్టారు. ‘ఎవరు బాధ్యులు’ అనే క్యాంపెయిన్‌ను ఆమె ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమెను కేంద్రాన్ని ప్రశి్నస్తున్నారు. దేశమంతటా వ్యాక్సిన్లకు కొరత ఏర్పడటంతో ముఖ్యమంత్రులంతా మోదీకి లేఖలు రాస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

గతేడాది ఆగస్టు 15న ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు తమ వద్ద పూర్తి ప్రణాళిక ఉందన్నారని, అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉందన్నారు. చెన్నై, పుణేలలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ల కారణంగా ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీకి భారత్‌ కేంద్రంగా మారిందన్నారు. భారత్‌కు ఉన్న తయారీ కేంద్రాలను చూస్తే ప్రపంచానికే ఎగుమతి చేసే అవకాశం ఉందని, అయితే ప్రణాళిక లేకపోవడం వల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

130 కోట్ల మంది భారతీయుల్లో 11 శాతం మందికి ఒకడోసు పూర్తి అవుతోందని, కేవలం 3 శాతం మందికి మాత్రమే పూర్తి వ్యాక్సినేషన్‌ అయిందన్నారు. ప్రధాని మోదీ టీకా ఉత్సవ్‌ను ఘనంగా జరిపిన తర్వాత వ్యాక్సినేషన్‌ 83 శాతం పడిపోయిందని అన్నారు. దేశంలోని ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయకుండా ఇతర దేశాలకు ఎందుకు పంపిస్తున్నారంటూ ప్రశ్నించారు.     

మరిన్ని వార్తలు