Priyanka Gandhi: అడ్డుకున్న పోలీసులు, సెల్ఫీల వీడియో వైరల్‌

20 Oct, 2021 17:08 IST|Sakshi

లక్నో: కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రాను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు.పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆగ్రా వెళుతుండగా బుధవారం లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్నో పోలీస్ లైన్స్‌కు తరలించారు. ప్రియాంకను అడ్డుకోవడం ఈ నెలలో ఇది రెండోసారి. ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినపుడు ఆమెను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలకు, యూపీ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.  దీనిపై  ప్రియాంక యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి వెళ్లినా అడ్డుకుంటారా అంటూ అధికారులను ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా  ఆమె పర్యటనను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.  దీంతో యోగీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ ప్రియాంక ట్విటర్‌లో మండిపడ్డారు.

బాధిత కుటుంబం న్యాయం కోరుకుంటోంది.. తాను ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నా. యూపీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది? తనను ఎందుకు ఆపుతున్నారు? ఈ రోజు వాల్మీకి జయంతి బుద్ధుడిపై ప్రధాని మోదీ గొప్పగా మాట్లాడుతారు. కానీ దానికి విరుద్ధంగా తనపై దాడి చేశారంటూ ఆమె హిందీలో ట్వీట్ చేశారు. 25 లక్షలు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ వాల్మీకి కుటుంబంతో తమ నేత మాట్లాడకుండా యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్  మండిపడింది.

మరోవైపు ప్రియాంక గాంధీని పోలీస్‌ లైన్‌కు తరలిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళా పోలీసులు ప్రియాంకతో సెల్ఫీ తీసుకునేందుకు మొహమాట పడుతుండగా, చొరవగా వారితో సెల్ఫీకి ఫోజులివ్వడంతోపాటు,  అప్యాయంగా పలకరించి  అక్కున చేర్చుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు