10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 

30 Dec, 2021 04:32 IST|Sakshi

20.64 శాతం లక్ష్యం పూర్తి 

1.36 లక్షలమంది రైతులకు లబ్ధి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంలో ఇప్పటికే 20.64 శాతం పూర్తయింది. బుధవారం నాటికి రూ.2,007.46 కోట్ల విలువైన 10,32,039 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తద్వారా 1,36,745 మంది రైతులు మద్దతు ధర పొందారు. 10 జిల్లాల్లోని 8,557 ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరద కారణంగా పంట దెబ్బతినగా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కోతలు ఆలస్యమయ్యాయి. ఈ జిల్లాల్లో స్వల్పంగా 1.35 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. 

పారదర్శకంగా చెల్లింపులు 
రైతులకు చెల్లింపులు పక్కదారి పట్టకుండా, జాప్యాన్ని నివారించడానికి పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా ఆధార్‌ నంబరు ప్రకారం నగదును జమచేస్తోంది. తొలిసారిగా ఫామ్‌–గేట్‌ (పొలాల వద్ద ధాన్యం కొనుగోలు) విధానం ద్వారా రైతులపై ఒక్క రూపాయి రవాణా ఖర్చు పడకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోతాల్లో నింపి నేరుగా మిల్లులకు తరలిస్తోంది.  

సడలింపునకు కేంద్రానికి వినతి 
రాష్ట్ర వ్యాప్తంగా 7,38,369 టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,31,946 టన్నులు, గుంటూరులో 1,53,472, పశ్చిమగోదావరిలో 78,848, చిత్తూరు జిల్లాలో 61,633 టన్నుల ధాన్యం దెబ్బతిని రంగుమారింది. మొలకలొచ్చాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో 1.77 లక్షల టన్నుల ధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో రైతులు తమ పంట విలువను నష్టపోకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నిబంధనల్లో సడలింపులు కోరుతూ కేంద్రానికి నివేదిక పంపించింది. దెబ్బతిన్న, రంగుమారిన, విరిగిన ధాన్యం కొనుగోలులో 5 శాతం ప్రమాణాలు పాటిస్తుండగా దాన్ని కర్నూలు జిల్లాలో 8 శాతం, వైఎస్సార్‌ కడపలో 15 శాతం, ప్రకాశంలో 30 శాతం, మిగిలిన జిల్లాల్లో 10 శాతానికి పెంచాలని కోరింది. 

ఏ ఒక్క రైతుకు నష్టం రానివ్వం 
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌరసరఫరాలశాఖ ద్వారా లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాం. ఈ క్రమంలోనే దెబ్బతిన్న ధాన్యం వివరాలను కేంద్రానికి పంపించి, కొనుగోలు ప్రమాణాల్లో జిల్లాల వారీగా సడలింపులు కోరాం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా నష్టం రానివ్వం. ఇప్పటికే 20 శాతానికిపైగా కొనుగోళ్లు పూర్తిచేశాం. 
– జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ  

మరిన్ని వార్తలు