ప్రోత్సాహక పథకంలో మార్పులు అవసరం

12 Sep, 2021 03:02 IST|Sakshi

పత్తి ఆధారిత వస్త్రోత్పత్తిని ప్రోత్సహించండి 

సమీకృత టెక్స్‌టైల్‌ పార్క్‌ పథకాన్ని తిరిగి ప్రారంభించండి 

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: వస్త్రోత్పత్తి రంగంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌)లో మరిన్ని మార్పులు చేయడంతోపాటు సమీకృత టెక్స్‌టైల్‌ పార్క్‌ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మరిన్ని అంశాలను జోడిస్తే వస్త్రోత్పత్తి రంగం మరింత బలోపేతమవుతుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌కు శనివారం రాసిన లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం కృత్రిమ దారాలకు (మాన్‌ మేడ్‌ ఫైబర్‌) మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయని, ఇవే ప్రోత్సాహకాలను పత్తి ఆధారిత వస్త్రోత్పత్తులు చేసే వారికి కూడా వర్తింపజేస్తే జౌళి పరిశ్రమతో పాటు పత్తి పంటను ఎక్కువగా సాగు చేసే తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. అన్ని రకాల ఫైబర్‌ వస్త్రోత్పత్తిని ప్రోత్సహిస్తే ఈ రంగంలో 7.5లక్షల మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.  

కనీస పెట్టుబడిని తగ్గించండి 
కృత్రిమ ఫైబర్‌ సెగ్మెంట్‌లో రూ.300 కోట్ల కనీస పెట్టుబడులు పెడితేనే కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు పొందే వీలుంటుందని, చైనా లాంటి దేశాలతో పోటీ పడేందుకు కనీస పెట్టుబడిని తగ్గించాలని కేటీఆర్‌ కోరారు. గార్మెంట్‌ రంగంలో కనీస పెట్టుబడిని రూ.100 కోట్ల నుంచి రూ.50కోట్లకు తగ్గిస్తే మరింతమంది యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వస్తారన్నారు.

భారీ టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు భూమి, ఇతర మౌలిక వసతుల కల్పన అవసరమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో యాంగ్వాన్, కైటెక్స్‌ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  

మరిన్ని వార్తలు