కూటమి.. నిప్పుల కొలిమి

3 Apr, 2024 05:17 IST|Sakshi

టీడీపీ, బీజేపీ, జనసేనల్లో పొత్తు రగడ      

టికెట్ల కేటాయింపుపై నిరసన సెగలు

తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావుపై నేతల కన్నెర్ర 

అభ్యర్థి మార్పు యోచనలో టీడీపీ అధిష్టానం!

అవనిగడ్డ గ్లాస్‌ పార్టీలో ఆగ్రహజ్వాల 

మండలికి వ్యతిరేకంగా ప్రదర్శన 

విశాఖ ఎంపీ సీటు జీవీఎల్‌కు ఇవ్వాలని బీజేపీ శ్రేణుల నిరసన 

తలలు పట్టుకుంటున్న అధిష్టాన వర్గాలు

అహర్నిశం ప్రజాహితం కోరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘పొత్తు’గట్టిన దుష్టగ్రహ కూటమి  నిప్పుల కొలిమై రగులుతోంది. మండుతున్న ఎండలకు దీటుగా అసమ్మతి జ్వాలతో  ఎగసిపడుతోంది.  రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల ప్రకోపానికి గడగడలాడుతోంది. ఫలితంగా  ఏం చేయాలో పాలుపోక టీడీపీ, బీజేపీ, జనసేన త్రయం తలలు పట్టుకుంటోంది. 

సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ/ఎంవీపీకాలనీ (విశాఖజిల్లా): తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు సొంత పార్టీలోనే నిరసన ఎదురవుతోంది. ఆది నుంచి ఆయన వివాదా­స్పద తీరు పార్టీ కార్యకర్తలకు, ఆయనకు మధ్య అంతరం పెంచుతోంది. ఆయన ఏకపక్ష ధోరణి ఇప్పుడు సీటుకే ఎసరు  తెచ్చేలా ఉంది. అసలు ఈ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని కొలికపూడి అమరావతి జేఏసీ కన్వీనర్‌ ముసుగులో పచ్చ పార్టీకి అనుకూలంగా పని చేయడంతో పారాచ్యూట్‌ నేతగా ఊడిపడ్డారు.

స్థానిక ముఖ్యనేతలకూ సమాచారం ఇవ్వకుండానే ఆయనను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. టీడీపీ అధినేత సొంత సామాజికవర్గ నేతలే కొలికపూడి తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మరో అభ్యర్థిని పరిశీలించాలని విన్నవించారు. లేకుంటే ఓటమి తప్పదని కరాఖండిగా చెప్పారు.

ఎస్సీ సామాజికవర్గానికి  చెందిన నేతలూ మాజీ మంత్రి జవహర్‌కు టికెట్‌ ఇవ్వాలని విన్నవించారు. దీంతో అభ్యర్థి«త్వం మార్పుపై అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రజల నుంచీ కొలికపూడికి నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల గంపలగూడెం మండలం మంచిరాలపాడులో ప్రచారానికి వెళ్లిన ఆయన సైకిల్‌ రావాలి..సైతాన్‌ పోవాలి అని అనడంతో మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు.ఫ్యాన్‌ గుర్తుకే మా ఓటు అంటూ చేతులూపుతూ కౌంటర్‌ ఇచ్చారు.   

♦ అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పార్టీలో చేరడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు సీటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీను ఇంటి నుంచి బయలుదేరిన ర్యాలీ మండలి కార్యాలయం ముందు నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకూ సాగింది.

అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రా­యపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ పార్టీ కోసం తొలి నుంచీ కష్టపడి పనిచేసిన వారికి టి­కెట్‌ ఇవ్వాలని కోరారు. డబ్బులే పరమావధిగా సాగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని చెప్పిన బుద్ధప్రసాద్‌ వారంలోనే రూ.50 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని విక్కుర్తి శ్రీను ప్రశ్నించారు. మండలి స్వగ్రామమైన భావదేవరపల్లికి చెందిన జనసేన నాయకుడు భోగాది భానుప్రకాష్‌ మాట్లాడుతూ ఆయనకు సీటిస్తే 150 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.

బచ్చు వెంకటనాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విక్కుర్తి శ్రీనుకు టికెటిస్తే గెలిపించుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కండు­వాలు మార్చే బుద్ధి తనకు లేదంటూ మండ­లి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను జనసేన నేతలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. సీటు కోసం రాత్రికి రాత్రే ఆయన పార్టీ మారడంపై నెటిజన్లూ మండిపడుతున్నారు.  

♦  విశాఖపట్నం ఎంపీ సీటును టీడీపీకి కేటాయించడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈమేరకు మంగళవారం విశాఖ లాసన్స్‌ బే కాలనీలోని ఆ పార్టీ నగర కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. విశాఖలో తొలి నుంచి బీజేపీకి పట్టుందని, సీటును టీడీపీకి కేటాయించడం తగదని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో బీజేపీ గాజువాక సమన్వయకర్త కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు విశాఖ అభివృద్ధికి కృషి చేశారని, ఆయనకు ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్‌చేశారు.

ఈ మేరకు వినతిపత్రాన్ని బీజేపీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రకు అందించారు. ఈ పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపిస్తున్నట్లు వివరించారు. వీలులేకుంటే బీజేపీ విడిగా స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పలువురు నేతలు మాట్లాడుతూ పురంధేశ్వరి బీజేపీని టీడీపీకి అమ్మేశారని దుయ్యబట్టారు.  

యనమల కోటలో నిట్టనిలువునా చీలిపోయిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: యనమల రామకృష్ణుడు, కృష్ణుడు ఇద్దరూ అన్నదమ్ముల బిడ్డలు. అయినా ఒక తల్లి కన్న బిడ్డల కంటే ఎక్కువగానే కలసిమెలిసి ఉన్నారు. ఏకంగా 40 ఏళ్లు పాటు కలసి నడిచారు. రాష్ట్రమంతా వారిద్దరూ సొంత అన్నదమ్ములనే అనుకునేంతగా పేరుపొందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ చంద్రబాబు తరువాత పెద్దన్న పాత్ర పోషించిన రామకృష్ణుడు రాష్ట్రంలో.. తునిలో కృష్ణుడు చక్రం తిప్పారు. అటువంటి వారిద్దరి మధ్య ఇన్నేళ్ల తరువాత తొలిసారి తలెత్తిన ఆధిపత్య పోరు వల్ల తునిలో టీడీపీ తునాతునకలైంది.

తునిలో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక రామకృష్ణుడు స్వచ్ఛందంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో కృష్ణుడు పదేళ్లుగా పోటీ చేస్తున్నా.. వైఎస్సార్‌ సీపీ హవా ముందు నిలబడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉనికి కోసం పాకులాడుతున్న రామకృష్ణుడు ఈసారి తన కుమార్తె దివ్యను బరిలోకి దింపారు. దశాబ్ద కాలంగా తునిలో టీడీపీని నడిపించిన కృష్ణుడిని దూరం పెట్టారు. టీడీపీ అభ్యర్థి దివ్య ప్రచారంలోనూ పాల్గొనవద్దని కృష్ణుడికి తెగేసి చెప్పేశారనే చర్చ జరుగుతోంది.

తునిలో టీడీపీ అంటే కృష్ణుడు అని భావించిన ఆ పార్టీ శ్రేణులు ఈ పరిణామాలతో కంగుతిన్నాయి. దీంతో పార్టీ రెండువర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయింది.  ఫలి­తం­గా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురైపోతున్నా­రు. కొందరు ఎవరిపక్షాన నిలవాలో అర్థంకాక స్తబ్దుగా ఉండిపోతున్నారు. రామకృష్ణుడి ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశానని, ఇప్పు­డు తననే ఆయన దూరం పెట్టారని కృష్ణుడు సన్నిహితుల వద్ద మధనపడుతున్నట్టు సమాచారం.

ఇంత అవమానం భరిస్తూ  టీడీపీలో కొనసాగలేమనే నిర్ణయానికి ఆయన వచ్చి­నట్టు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుందామని అనుచరుల నుంచి కృష్ణుడిపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. అన్నదమ్ముల తగవు చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఆయన కిమ్మనకుండా ఉండడంపైనా కార్యకర్తలు పెదవివిరుస్తున్నారు. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers