విచిత్ర రాజకీయం: ముందుగానే నామినేషన్లు 

17 Mar, 2021 14:44 IST|Sakshi

అభ్యర్థుల ప్రకటన కంటే ముందే నామినేషన్లు 

పోటీకి దూరంగా నారాయణ

సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం విచిత్ర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందే, ఆయా నేతలు తమకు పట్టున్న స్థానాలపై గురి పెట్టి నామినేషన్లు వేయడం చర్చకు దారి తీసింది.  పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌–బీజేపీ–అన్నాడీఎంకే కూటమి వ్యవహారం మొదటి నుంచి వివాదాలు, ట్విస్టుల నడుమ సాగిన విషయం తెలిసిందే. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 16 చోట్ల, బీజేపీ, అన్నాడీఎంకేలు 14 చోట్ల పోటీకి నిర్ణయించాయి. అన్నాడీఎంకే –బీజేపీల మధ్య సీట్ల పంపకాలు సాగలేదు. ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో కూటమిలో ఇంత వరకు తేలలేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లోనే ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆ కూటమికి తానే సీఎం అభ్యర్థి అని ప్రకటించుకున్న ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత రంగస్వామి తట్టాన్‌ చావడి నుంచి పోటీకి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ పార్టీకి చెందిన మరో నలుగురు తమకు పట్టున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. ఇదే అదనుగా బీజేపీకి చెందిన ముగ్గురు, అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు నేతలు తమకు పట్టున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయడంతో కూటమి వ్యవహారం విచిత్ర పరిస్థితుల్లోకి నెట్టినట్టు అయింది.  తమకు పట్టున్న స్థానాల్లో ముందుగానే నామినేషన్లు వేసి రిజర్వు చేసుకునే పనిలో నేతలు ఉండడం గమనార్హం. 

కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి.. 
కాంగ్రెస్‌–డీఎంకే కూటమిలోనూ అదే పరిస్థితి. డీఎంకే అయితే, అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక కుస్తీలు సాగుతున్నాయి. మరో రెండు రోజులే నామినేషన్లకు గడువు ఉన్న నేపథ్యంలో తమకు పట్టున్న స్థానాలపై గురి పెట్టిన పలువురు కాంగ్రెస్‌ నేతలు ముందుగానే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో మాజీ సీఎం నారాయణ స్వామి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించినట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు