పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్‌ సర్కార్‌

22 Feb, 2021 11:58 IST|Sakshi
పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాజీనామా

బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి సర్కార్‌

రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరిన సీఎం 

సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగిన పుదుచ్చేరి రాజకీయాలకు తెర పడింది. బల నిరూపణలో నారాయణస్వామి సర్కార్‌ విఫలమయ్యింది. దాంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. సరైనా సంఖ్యబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లి పోయారు. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌ జరగకముందే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. దాంతో విశ్వాసం తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ వీపీ శివకొలందు ప్రకటించారు.

బలనిరూపణలో ఓడిపోయిన సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ మీద నిప్పులు చెరిగారు నారాయణ స్వామి. కేంద్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కలిసి‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వారు ప్రజల ముందుకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు.

2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు సాఫీగానే సాగింది. ఇలా ఉండగా గతేడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్‌ తిగురుబావుటా ఎగురవేశారు. ఇక నాటి నుంచి నారాయణ స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో ప్రభుత్వం మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాతో కాంగ్రెస్‌ సర్కార్‌ కుప్పకూలింది.

ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్‌ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్‌ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. తాజాగా నేడు నిర్వహించని బల పరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం విఫలం అవడంతో ఆయన రాజీనామా చేశారు. 

మరిన్ని వార్తలు