22న బలం నిరూపించుకోండి

19 Feb, 2021 05:02 IST|Sakshi
ఎల్‌జీగా ప్రమాణం చేసిన తమిళిసైకి çపుష్పగుచ్ఛమిస్తున్న పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి

సీఎం నారాయణస్వామికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై ఆదేశం

సాక్షి ప్రతినిధి, చెన్నై/యానాం: పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ఆదేశించారు. ‘విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలి. ఈ కార్యక్రమం మొత్తం వీడియో రికార్డింగ్‌ జరగాలి. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగియాలి’అని గవర్నర్‌ కార్యాలయం ఒక తెలిపింది. అంతకుముందు, తెలంగాణ గవర్నర్‌  తమిళిసై సౌందరరాజన్‌ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి గవర్నర్‌ బంగ్లా రాజ్‌నివాస్‌లో ఆమె చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీప్‌ బెనర్జీ పదవీ ప్రమాణం చేయించారు.

సీఎం నారాయణస్వామి ఆమెకు పుష్పగుచ్ఛమిచ్చి సత్కరించారు. తెలంగాణ, పుదుచ్చేరి అనే కవలపిల్లలను ఎలా చూసుకోవాలో తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వలసలు, రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. అయితే ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్‌ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది.

మరిన్ని వార్తలు