ముఖ్యశాఖలపై బీజేపీ కన్ను.. ఎట్టకేలకు కొలువుదీరిన మంత్రివర్గం

12 Jul, 2021 08:15 IST|Sakshi

సాక్షి, చెన్నై: రెండు నెలల అనంతరం పుదుచ్చేరి మంత్రి వర్గం శాఖల కేటాయింపుతో పూర్తి స్థాయిలో కొలువుదీరింది. ఐదుగురు మంత్రులకు సీఎం రంగస్వామి ఆదివారం శాఖల్ని కేటాయించారు. గత నెల 27న బీజేపీకి చెందిన ఇద్దరు, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరికి శాఖల కేటాయింపుల్లో జాప్యం తప్పలేదు. ముఖ్యశాఖలపై బీజేపీ కన్నేయడంతోనే ఈ జాప్యం నెలకొంది. ఎట్టకేలకు శాఖల కేటాయింపు ప్రక్రియను సీఎం రంగస్వామి  ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదంతో ముగించారు.

సీఎం రంగస్వామి చేతిలో సాధారణ, స్థానిక పాలన, ఆరోగ్యం, దేవదాయ, హార్బర్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహా 13 శాఖలు ఉన్నాయి. బీజేపీ మంత్రి నమశ్శివాయంకు హోం, విద్యుత్, పరిశ్రమలు, విద్య, క్రీడలు సహా ఆరు శాఖలు కేటాయించారు. మరో బీజేపీ మంత్రి సాయి జె శరవణకుమార్‌కు పౌరసరఫరాలు, డీఆర్‌డీఏ, అగ్ని మాపక, మైనారిటీ వ్యవహారాలు సహా ఆరు శాఖలు అప్పగించారు. ఇక, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ మంత్రులు లక్ష్మీనారాయణన్‌కు ప్రజాపనులు, పర్యాటకం, మత్స్య, న్యాయ, సమాచార శాఖలు, తేని జయకుమార్‌కు వ్యవసాయం, అటవీ, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన సామాజిక వర్గం, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, చంద్ర ప్రియాంకాకు రవాణా, ఆది ద్రావిడ, గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖ లను కేటాయించారు.   

మరిన్ని వార్తలు