Punjab Assembly Election 2022: పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్‌

18 Jan, 2022 12:25 IST|Sakshi

చండీగఢ్‌: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. పంజాబ్‌లోనూ పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆప్‌.. తాజాగా మరో ముందడుగు వేసింది. పంజాబ్‌ సీఎం అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మంగళవారం మొహాలీలో జరిగిన మీడియా సమావేశంలో భగవంత్‌ మాన్‌ పేరును ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖరారు చేశారు. 93 శాతం మంది భగవంత్‌ పేరును సూచించారని ఆయన తెలిపారు. 3 కోట్ల మంది ప్రజల అభిప్రాయం మేరకే సీఎం అభ్యర్థి ఎంపిక జరిగినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

భగవంత్‌ మాన్‌ ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 20న జరగనుండగా.. మార్చి 10వ తేదీన ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి. కాగా పార్టీ సీఎం అభ్యర్థి పేరును ప్రతిపాదించాలని కోరుతూ ఆప్‌ ఇటీవల ఓ మొబైల్‌ నెంబర్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ నెంబర్‌ ద్వారా ప్రజలు తమ ఫీడ్‌ బ్యాక్‌ను అందించాలని కోరింది. అయితే 96 గంటల్లో 19 లక్షల మంది నుంచి ఫీడ్‌ బ్యాక్‌ పార్టీకి అందిందని ఆప్‌ నేత హర్పాల్‌ సింగ్‌ చీమా తెలిపారు.
చదవండి: ఏడుపు ఆపండి సార్‌! బీజేపీకి కాంగ్రెసే ఆశాకిరణం!

మరిన్ని వార్తలు