Punjab Assembly Elections 2022: భజనలు చేస్తూ మోదీ.. లంగర్‌లో వడ్డిస్తూ రాహుల్‌

17 Feb, 2022 05:13 IST|Sakshi
ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని రవిదాస్‌ ఆలయంలో భజనచేస్తున్న మోదీ

గురు రవిదాస్‌ జయంతిని ఘనంగా నిర్వహించిన రాజకీయ పార్టీలు

వారణాసిలో పంజాబ్‌ ఎన్నికల షో  

దళితుల ఓట్ల కోసం పార్టీల ఆరాటం

ఎన్నికల వేళ రవిదాస్‌ జయంతికి ఎనలేని ప్రాధాన్యం

వారణాసి/ఢిల్లీ: పంజాబ్‌ ఎన్నికల సందడి అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో కనిపించింది. కాంగ్రెస్‌ నుంచి ఆప్‌ వరకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరూ గురు రవిదాస్‌ సంస్మరణలో మునిగితేలారు. 15వ శతాబ్దానికి చెందిన దళిత నాయకుడు గురు రవిదాస్‌ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాజకీయ నాయకులు, భక్తులతో వారణాసి కిటకిటలాడిపోయింది. రవిదాస్‌ అనుచరుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని అన్ని పార్టీల వారు పోటీలు పడి మరీ ప్రార్థనలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో రవిదాస్‌ ఆలయాన్ని సందర్శించి మహిళా భక్తులతో కలిసి కూర్చొని భజనలు చేశారు. రవిదాస్‌ జన్మస్థలమైన వారణాసిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఒక ఎంపీగా తనకా అవకాశం దక్కడం అదృష్టమని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వారణాసిలోని రవిదాస్‌ ఆలయంలో లంగర్‌ (సమూహ భోజనాలు)లో భక్తులకు భోజనాలు వడ్డించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తెల్లవారుజామున 4 గంటలకే రవిదాస్‌ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ కూడా ప్రార్థనలు చేశారు.  

రవిదాస్‌కి ఎందుకింత ప్రాధాన్యం
► గురు రవిదాస్‌ వారణాసిలోని గోవర్ధన్‌పూర్‌ గ్రామంలో చర్మకారుల కుటుంబంలో జన్మించారు. రవిదాసియా అనే ప్రత్యేక మతాన్ని వ్యాప్తి చేశారు. పంజాబ్‌లో ప్రముఖ డేరా సచ్చఖానంద్‌ బల్లాన్‌ రవిదాసియా మతాన్నే ఆచరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ డేరాకు 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు.
 

► చిన్నప్పట్నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఆయన సమాజంలో నెలకొన్న వర్ణ వివక్షను ప్రశ్నిస్తూ కవిత్వం రాశారు. ఆయన రాసిన కవిత్వానికి, రవిదాసులో సాహితీవేత్తకి  కులాలకతీతంగా అభిమానులున్నారు.  

► సిక్కు రాడికల్‌ సంస్థకు చెందిన కొందరు నాయకులు 2009లో వియన్నాలో గురు రవిదాస్‌ డేరాలపై జరిపిన దాడిలో ఒక నాయకుడు మరణించాడు. దీంతో సిక్కు మతంతో తమకు సంబంధం లేదని ఆ డేరా ప్రకటించింది. గురు గ్రంథ సాహిబ్‌ స్థానంలో రవిదాస్‌ రచించిన 200 కీర్తనలతో కూడిన అమృత్‌వాణిని తీసుకువచ్చారు. అదే తమకు మత గ్రంథమని ప్రకటించుకున్నారు.  

► పంజాబ్‌ జనాభాలో 32 శాతం దళితులున్నారు. వారిలో ఎక్కువ మంది రవిదాస్‌ అనుచరులు కావడంతో రాజకీయ పార్టీల తలరాతలు మార్చే ఓటు బ్యాంకుగా  మారారు.  

► ఈ సారి పంజాబ్‌ ఎన్నికలు ఫిబ్రవరి 14నే జరపాలని తొలుత ఎన్నికల సంఘం నిర్ణయించినప్పటికీ రవిదాస్‌ జయంతి కోసం ఎన్నికల్ని కూడా 20 తేదీకి వాయిదా వేసింది.  

► పంజాబ్‌లో దళితుల ఓట్లను ఆకర్షించడానికి  గతంలో బీఎస్పీ ప్రయత్నించి కొంత సఫలమైంది. అయితే ఆ పార్టీకి రామ్‌దాసియా సిక్కుల మద్దతు మాత్రమే లభించింది. ఈసారి వీరి ఓట్ల కోసం ప్రతీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.  

వారణాసిలోని రవిదాస్‌ ఆలయంలో వడ్డిస్తున్న రాహుల్‌

మరిన్ని వార్తలు