పొలిటికల్‌ సిద్ధూయిజం: క్రికెట్‌లో అజారుద్దీన్‌నీ వదల్లేదు.. రాజకీయాల్లో..

20 Jan, 2022 07:32 IST|Sakshi

క్రికెటర్‌గానైనా, కామెంటేటరైనా, కమేడియెన్‌గా మారినా, పొలిటికల్‌ లీడర్‌ అవతారం ఎత్తినా సిద్ధూ రూటే సెపరేటు. సిద్ధూ అంటే వివాదం, సిద్ధూ అంటే వినోదం, సిద్ధూ అంటే ఓ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌. మాట్లాడితే చాలు, ప్రత్యర్థులకి పంచ్‌ పడాల్సిందే. సిక్సర్ల సిద్ధూ నుంచి సింగిల్‌ లైనర్‌ సిద్ధూగా ఆయన ప్రయాణం నిత్యం సవాళ్లతో కూడుకొని ఉంది. ఆ సవాళ్లను స్వీకరిస్తూనే  తనదే పై చేయి కావాలనే స్వభావం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అదరరు, బెదరరు. క్రికెట్‌లో కెప్టెన్‌ అజారుద్దీన్‌నీ వదల్లేదు. రాజకీయాల్లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌నీ విడిచిపెట్టలేదు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, అధిష్టానంపైనే సిక్సర్లు విసురుతున్నారు. మిన్నువిరిగి మీదపడినా తాను నమ్మిన సిద్ధాంతాల్లో రాజీ పడనంటూ దూకుడుగా అనుకున్న లక్ష్యాల వైపు పరుగులు తీస్తున్నారు.  

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సర్దార్‌ బల్వంత్‌ సింగ్, నిర్మల దంపతులకు 1963 అక్టోబర్‌ 20న జన్మించారు. 
చిన్నప్పట్నుంచి క్రికెట్‌ అంటే అమితమైన ఇష్టం. పాటియాలాలో డిగ్రీ వరకు చదువుకున్నారు.  
1983లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టి 16 ఏళ్ల పాటు ఎదురు లేని బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. 51 టెస్ట్‌ మ్యాచ్‌లు, 100కి పైగా వన్డే మ్యాచ్‌లో ఓపెనర్‌గా ప్రత్యర్థి బౌలర్లకి చుక్కలు చూపించి సిక్సర్ల సిద్ధూగా పేరు తెచ్చుకున్నారు.   
సిద్ధూ భార్య నవజోత్‌ కౌర్‌ వృత్తి రీత్యా డాక్టర్‌. ఆమె కూడా రాజకీయాల్లో ఉన్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.  
1996లో ఇంగ్లండ్‌ టూర్‌లో ఉండగా కెప్టెన్‌ అజారుద్దీన్‌తో విభేదాలు వచ్చి టూర్‌ మధ్యలోంచి వెనక్కి వచ్చేశారు. అప్పుడే సిద్ధూ తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో  ప్రపంచానికి తెలిసింది.   
1998లో పంజాబ్‌లోని పాటియాలాలో వాహనం పార్కింగ్‌పై వివాదం నెలకొని 65 ఏళ్ల వ్యక్తిని చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఆ కేసులో బుక్కయ్యారు. దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశాక 2018లో సుప్రీంకోర్టు సిద్ధూని విముక్తుడిని చేసింది.  
1999లో క్రికెట్‌కి గుడ్‌బై కొట్టేశారు. ఆ తర్వాత కామెంటేటర్‌గా తన సంభాషణా చాతుర్యంతో నవ్వులు పండించి ఫాలోవర్లను పెంచుకున్నారు. సింగిల్‌ లైన్‌ పంచ్‌ డైలాగ్‌లతో అసమాన ప్రతిభ కనిపించారు. వాటినే అభిమానులు ప్రేమగా సిద్ధూయిజం అని పిలిచేవారు.  
కపిల్‌ శర్మ కామెడీ షోలో మొదటి రెండు సీజన్లలోనూ అతిథిగా కనిపించి అందరినీ అలరించారు. కమెడీయన్‌గా కూడా సత్తా చాటారు. సిద్ధూ పగలబడి నవ్వితే చాలు, టీఆర్‌పీ రేటింగ్స్‌ దుమ్ము రేగ్గొట్టేవి.  

చదవండి: (Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!) 

బీజేపీ నేత అరుణ్‌ జైట్లీని స్ఫూర్తిగా తీసుకొని 2004లో బీజేపీ గూటికి చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.  
ఆ తర్వాత రెండేళ్లకే వ్యక్తిని కొట్టి చంపిన కేసులో కింది కోర్టు దోషిగా తేల్చడంతో 2006లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  
ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో 2007లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో  పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సురీందర్‌ సింగ్లాను 77,626 ఓట్ల తేడాతో ఓడించారు 
2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకురాలు అంబికా సోనిని ఓడించి వరస గా మూడోసారి లోక్‌సభకి ఎన్నికయ్యారు.  
2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2016 ఏప్రిల్‌లో మోదీ ప్రభుత్వం సిద్ధూని రాజ్యసభకు పంపింది. బీజేపీలో ఉన్నంతకాలం శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు వద్దంటూ పార్టీ పెద్దలపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చేవారు.  
బీజేపీ అధిష్టానం వైఖరితో రాజీపడలేక రాజ్యసభ ఎంపీ పదవికి 2016 జులై 18న రాజీనామా చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో బీజేపీకి గుడ్‌బై కొట్టేశారు. 
2017లో కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ ఎ న్నికల్లో అమృత్‌సర్‌ తూర్పు నియోజ కవర్గం నుంచి ఎమ్మెల్యేగాఎన్నికయ్యారు.  
కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.  
v2018 ఆగస్టులో పాకిస్తాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూ పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాను ఆలింగనం చేసుకోవడం వివాదాస్పదమైంది. అప్పట్నుంచి సీఎం అమరీందర్‌ సింగ్, సిద్ధూ మధ్య విభేదాలు మొదలయ్యాయి.  
2019 లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య నవజోత్‌ కౌర్‌కి టిక్కెట్‌ నిరాకరించడంతో బహిరంగంగానే అమరీందర్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. సిద్ధూ శాఖని మార్చడం తో కేబినెట్‌ నుంచి తప్పుకున్నారు.  
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ రెండేళ్ల పాటు అమరీందర్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. చివరికి సిద్ధూయే పైచేయి సాధించడంతో అమరీందర్‌ కాంగ్రెస్‌ని వీడారు.  
 కాంగ్రెస్‌ పార్టీ 2021 జులై 18న సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేసింది 
మూడు నెలలు తిరక్కుండానే పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ విధానాలని వ్యతిరేకిస్తూ 2021 సెప్టెంబర్‌ 21న పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆ రాజీనామాను తిరస్కరించింది. 
2021 నవంబర్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్‌కు వెళ్లి ఇమ్రాన్‌ను పెద్దన్నగా కీర్తించడం కూడా వివాదాస్పదమైంది.  
2022 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (దళిత సామాజిక వర్గానికి చెందిన వారు) ఉంటాడని చెప్పలేని బలహీనత కాంగ్రెస్‌ది. అదే జరిగితే సిద్దూ ఈసారి అంపైర్‌ తలే పగులగొట్టడం ఖాయం (కాంగ్రెస్‌ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తారు). మరోవైపు పంజాబ్‌లో 32 శాతం ఉన్న దళితుల ఓట్లపై ప్రేమతో సిద్దూను సీఎం అభ్యర్థిగా ప్రకటించే సాహసం కాంగ్రెస్‌ చేయడం లేదు. 
 – నేషనల్‌ డెస్క్,సాక్షి  

మరిన్ని వార్తలు