Sukhbir Singh Life Story: వ్యూహకర్త బాదల్‌

23 Jan, 2022 10:50 IST|Sakshi

తండ్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ నుంచి వచ్చిన వారసత్వం, సిక్కుల నుంచి సంప్రదాయంగా వచ్చే మద్దతు, పంజాబ్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను చదివిన ఎంబీఏకి సార్థకత వచ్చేలా పారిశ్రామికంగా చేసిన అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు.. ఇవన్నీ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ని కీలక నేతని చేశాయి. కానీ గత ఎన్నికల్లో ఘోరపరాజయం, శిరోమణి అకాలీదళ్‌ నుంచి వలసలు, పార్టీ నేతలపై డ్రగ్స్‌ కేసులు వంటివన్నీ ఆయనపై భారాన్ని పెంచుతున్నాయి. ఆత్మరక్షణలో పడాల్సిన అంశాలనే ఎన్నికల్లో అస్త్రాలుగా మార్చుకునే వ్యూహాలు రచించడంలో దిట్టయిన బాదల్‌కి ఈసారి పంజాబ్‌ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. 

ప్రకాశ్‌సింగ్‌ బాదల్, సురీందర్‌ కౌర్‌ బాదల్‌ దంపతులకు జూలై 9, 1962లో జన్మించారు.
చండీగఢ్‌ యూనివర్సిటీలో డిగ్రీ, అమెరికా లాస్‌ఏంజెలిస్‌లో ఎంబీఏ చేశారు.  
హర్‌సిమ్రత్‌ కౌర్‌ని పెళ్లాడారు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  
1996లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో కూడా పార్లమెంటుకు ఎన్నికై అటల్‌ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 
2001 నుంచి 2004 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు 
 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఫరీద్‌కోట నుంచి ఎన్నికయ్యారు.  
 2008 జనవరిలో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడయ్యారు 
పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రిగా 2009–2017 వరకు సేవలందించారు 
 ఎంబీఏ చదవడంతో రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి కోసం కృషి చేశారు.  
► 2019లో పంజాబ్‌ ఫిరోజ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఆ పార్టీతో పొత్తుని తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బాదల్‌ భార్య హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేసి తన నిరసన తెలిపారు.  
ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతున్న శిరోమణి అకాలీదళ్‌లో చాలా మంది సిక్కు నేతలు, సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కి అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడి బీజేపీలో చేరడం కలవరపెడుతోంది.  
అకాలీదళ్‌లో సీనియర్‌ నేత మంజీదర్‌ సింగ్‌ సిర్సా బీజేపీలో చేరడంతో బాదల్‌పై మరింత భారం పడినట్టయింది. పార్టీని వీడుతున్న నాయకుల్ని కాపాడుకోలేకపోతున్నారన్న విమర్శలు బాదల్‌పై ఎక్కువయ్యాయి.  
సిక్కులకు పరమ పవిత్రమైన గురుద్వారాలు లక్ష్యంగా జరుగుతున్న దాడులు, సిక్కుల మత గ్రంథాలను కించపరిచే ఘటనలే ఈసారి ఎన్నికల అంశాలుగా లేవనెత్తుతున్నారు. .  
అకాలీదళ్‌లో పలువురు నేతలపై మాదకద్రవ్యాల కేసులు నమోదయ్యాయి. వారిలో బాదల్‌ బావమరిది విక్రమ్‌ మజితాయ్‌ కూడా ఉన్నారు. కేసులు నమోదైనప్పుడు ఆత్మరక్షణలో పడినప్పటికీ ఎన్నికల సమయంలో బాదల్‌ వాటినే అస్త్రాలుగా మార్చుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షతోనే తమపై కేసులు పెడుతోందని ఆరోపణలు చేస్తున్నారు.  
గత ఎన్నికల్లో కేవలం 15 స్థానాలతో మూడో స్థానంలో నిలిచిన పార్టీని ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు గట్టెక్కిస్తారనేది బాదల్‌ నాయకత్వ సమర్థతకి అగ్నిపరీక్ష.
► 94 ఏళ్ల వయసులో కూడా ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కుమారుడికి అండగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండడంతో కలిసొచ్చే అంశం.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి  

మరిన్ని వార్తలు