Punjab Assembly Election 2022: ఆప్‌కి ‘ఒక్క చాన్స్‌’ ఇస్తారా!

19 Feb, 2022 05:17 IST|Sakshi

మళ్లీ హస్తానికే అప్పగిస్తారా?

సింగ్‌ల గడ్డపై ‘కింగ్‌’ ఎవరో..

పంజాబ్‌ ఓటరు మొగ్గు ఎటువైపు!

బీజేపీ లేని అకాలీదళ్‌కు 35 లోపే ఓటు శాతం

అమరీందర్‌ తేలిపోవడంతో బీజేపీకి సన్నగిల్లిన ఆశలు

తాము ‘కీ’లకం కావాలంటే ‘హంగ్‌’ వస్తే   మేలని భావిస్తున్న కమలదళం

అన్ని పార్టీలనూ అంతర్గత సమస్యలు వేధిస్తున్నాయ్‌. ప్రతీ స్థానంలోనూ బహుముఖ పోటీ నెలకొని గుబులు పుట్టిస్తోంది. పంజాబ్‌లో మార్పు కోసమేనంటూ పోటాపోటీగా ఇచ్చిన హామీలు ఎవరికెంత లాభం చేకూరుస్తాయి?  ఢిల్లీ మోడల్‌ పాలన అంటున్న ఆప్‌కు పంజాబీలు ‘ఒక్క చాన్స్‌’ ఇస్తారా! దళిత కార్డుతో రాజకీయం చేస్తున్న హస్తం పార్టీకే వరుసగా రెండోసారి అధికారపీఠం అప్పగిస్తారా? పంజాబ్‌లో ఇప్పుడు అందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఎప్పుడైతే గెలుచుకుందో అప్పట్నుంచి ఢిల్లీకి వెలుపల ఆ పార్టీ విస్తరణ మొదలైంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా 20 సీట్లు , 23.72% ఓటు షేరుతో పంజాబ్‌ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడిపోయినా.. ఇప్పుడు బలం పుంజుకొని అధికార కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచి గట్టి సవాల్‌ విసురుతోంది. ఢిల్లీ మోడల్‌ పరిపాలన, అధికారంలోకి వస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆప్‌కున్న క్లీన్‌ ఇమేజ్, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో  ఢిల్లీలో ఆప్‌ చేస్తున్న అభివృద్ధి పంజాబ్‌లోని దిగువ మధ్యతరగతిని ఆకర్షిస్తోంది.

తప్పుల్ని సరిదిద్దుకుంటూ..  

2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ప్రాంతీయ పార్టీ కాకపోవడంతో బయటవాళ్లు అన్న ముద్ర, ప్రత్యర్థులందరూ ఇదే అంశాన్ని పదే పదే ఎత్తిచూపిస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆప్‌ తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. మరే రాజకీయ పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్‌ ద్వారా పార్టీ రాజ్యసభ సభ్యుడు భగవంత్‌ మన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది.

పంజాబ్‌ ఓటర్లలో 45 శాతం ఉన్న.. 96 లక్షల మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. 12 మంది విద్యాధికులైన మహిళలకు టికెట్లు ఇచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలపైనే ఆప్‌ ప్రధానంగా దృష్టి సారించింది. అక్రమ ఇసుక తవ్వకాలను అరికడితే రాష్ట్రానికి 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని, దానిని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చునని కేజ్రివాల్‌ విస్తృతంగా ప్రచారం చేశారు.  ఈ ఇసుక మాఫియాలో సీఎం చన్నీ సహా కాంగ్రెస్‌ మంత్రులందరూ ఉన్నారని ఆయన ఆరోపిస్తూ వచ్చారు.

  అయితే కాంగ్రెస్, లేదంటే అకాలీల పాలనే గత కొన్ని దశాబ్దాలుగా చూసిచూసి విసిగెత్తిన ప్రజలకు ఆప్‌ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.  పంజాబ్‌ యువత కూడా ఆప్‌వైపే చూస్తున్నారు. అయినప్పటికీ ఆ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. గత అయిదేళ్లలో 20 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. సంస్థాగతంగా పార్టీ బలంగా లేదు. కార్యకర్తల బలం కనిపించడం లేదు. సీఎం అభ్యర్థి భగవంత్‌ మన్‌ సమర్థుడు కాదన్న వాదనలు ఉన్నాయి. కేజ్రివాల్‌ క్రేజ్‌తోనే ఆ పార్టీ గట్టిగా నిలబడుతోంది.  

కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే శత్రువు  

కాంగ్రెస్‌లో ముఠా తగాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూయే ఆ పార్టీకి ప్లస్‌ అవుతారో, మైనస్‌గా మారుతారో తలపండిన రాజకీయ నాయకులకి సైతం అర్థం కావడం లేదు. ‘కాంగ్రెస్‌ పార్టీని కాంగ్రెస్‌ మాత్రమే ఓడించగలదు’ అని ఇటీవల బహిరంగంగా చెప్పిన సిద్ధూ సీఎం అభ్యర్థి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి పక్కలో బల్లెంలా ఉన్నారు. అయితే చన్నీ దళితుడు కావడం, రాష్ట్ర జనాభాలో 32 శాతం వారే ఉండటంతో కాంగ్రెస్‌కి కాస్త అనుకూలంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎం పదవిలోకి వచ్చిన చన్నీ కొద్ది కాలంలోనే తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల్ని ఆకర్షించేలా ఉన్నాయి.

స్వల్పకాలంలోనే చన్నీ ప్రభుత్వం 60 నిర్ణయాలను అమలు చేసింది దానికి సంబంధించిన రిపోర్ట్‌ కార్డుని కూడా విడుదల చేసింది. అసంఘటిత కార్మికులకు వేతనాలు, పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు పే కమిషన్, నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేక సాయం, పదో తరగతి వరకు పంజాబీ భాష తప్పనిసరి, 2 కిలోవాట్ల లోడ్‌ వరకు గృహ వినియోగదారుల విద్యుత్‌ బకాయిల మాఫీ , లక్ష కొత్త రేషన్‌ కార్డుల జారీ వంటివెన్నో చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. మాదకద్రవ్యాలు, ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టడానికి మిషన్‌ క్లీన్‌ని కాంగ్రెస్‌ ప్రారంభించింది.  

నోట్‌ దిస్‌ పాయింట్స్‌
► బీజేపీతో పొత్తు ఉండబట్టి రెండుసార్లు అధికారం చేపట్టింది కానీ గత ఇరవై ఏళ్లలో ఏ ఎన్నికలను తీసుకున్నా.. అకాలీదళ్‌కు సొంతంగా వచ్చిన ఓట్లు 35 శాతం దాటలేదు.  
► మరోవైపు బీజేపీని తీసుకుంటే హిందువులు మెజారిటీగా ఉన్న నాలుగు జిల్లాలు, పట్టణ ప్రాంతాలకే ఆ పార్టీ పరిమితమైంది. అకాలీదళ్‌తో పొత్తు ఉన్నందువల్ల బీజేపీ గ్రామీణ పంజాబ్‌లోని 94 స్థానాల్లో (మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు) ఏనాడూ పోటీచేయలేదు.  
► బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో గరిష్టంగా 7.8 శాతం ఓట్లు వచ్చాయి.

కొత్త పొత్తులతో లాభం ‘ఇల్లె’!
ఈసారి ఎన్నికల కోసం శిరోమణి అకాలీదశ్, బీఎస్పీలు 2021 జూన్‌లోనే కూటమి కట్టాయి. అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ చాలాముందు నుంచే టికెట్లు ఖరారు చేశారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు టిక్కెట్లిచ్చారు. అయితే బీఎస్సీ అధినేత్రి పంజాబ్‌పై దృష్టి పెట్టకపోవడం.. ఇక్కడ ప్రచారానికి రాకపోవడం అకాలీదళ్‌ అవకాశాలను బాగా దెబ్బతీసే అంశమే. ఇక బీజేపీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ కూటమి ప్రభావం నామమాత్రంగానే ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు