కాంగ్రెస్‌ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోంది

18 Feb, 2022 06:03 IST|Sakshi

పంజాబ్‌  ర్యాలీలో ప్రధాని మోదీ ధ్వజం  

ఫతేపూర్‌: కాంగ్రెస్‌ పనిగట్టుకొని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇలా విభేదాలను రెచ్చగొట్టే పార్టీలకు పరిపాలించే అధికారం ఉండదన్నారు. యూపీ, బిహార్, ఢిల్లీకి చెందినవారంతా ఒక్కటేనని వారిని పంజాబ్‌లోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తన స్వప్రయోజనాల కోసం ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంపైకి ఉసిగొల్పుతూ ఉంటుందని నిందించారు.

పంజాబ్‌ అబోహర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చన్నీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.  చన్నీ అలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ చప్పట్లు కొడుతున్నారని యావత్‌దేశం దీనిని చూసిందన్నారు. యూపీలోని ఫతేపూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంతో స్వార్థంతో ఆలోచిస్తాయని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌ని రద్దు చేస్తూ చట్టం తెస్తే విపక్షాలన్నీ ఏకమై వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే తన నిర్ణయానికి ముస్లిం మహిళలు అంతా అండగా ఉన్నారని, వారి బతుకులు బాగు చేసినందుకు కృతజ్ఞతలు వెల్లడించారని మోదీ పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు