పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా

18 Sep, 2021 16:44 IST|Sakshi

సీఎల్పీ భేటీకి ముందే రాజీనామా

గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించిన అమరీందర్‌ సింగ్‌

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేశారు. కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి శనివారంతో తెరపడింది. రాజ్‌భవన్‌కు చేరుకుని అమరీందర్‌ సింగ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎల్పీ భేటికి ముందే రాజీనామా చేయడం గమనార్హం. సీఎంతో పాటు మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. 2017 మార్చి 16న సీఎంగా అమరీందర్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో విబేధాలు కొనసాగుతున్నాయి.

రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉదయం సోనియాగాంధీతో మాట్లాడా. నమ్మకం లేని చోట నేను ఉండను. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టారు. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్నట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోమని చెప్పా’ అని తెలిపారు.

అయితే తన భవిష్యత్‌ కార్యాచరణపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. ‘రాజకీయ భవిష్యత్‌ గురించి నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలు వినియోగిస్తా. నా వెంట ఉన్నవారితో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం’ అని అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. ఈ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో వివాదం మరింత ముదిరింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాలు తారస్థాయికి చేరాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

చదవండి: మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి 

మరిన్ని వార్తలు