పంజాబ్‌ సీఎం సంచలన ప్రకటన.. ఇలా చేసిన మొదటి వ్యక్తి భగవంత్‌ మాన్‌..?

23 Mar, 2022 21:17 IST|Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సీఎంగా భగవంత్‌ మాన్‌ బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్‌, భగవంత్ మాన్‌ ఆలోచనలతో పంజాబ్‌లో వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది ఆప్‌ ప్రభుత్వం. ఇప్పటికే ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పి, మంత్రులకు టార్గెట్‌ విధించిన ఆప్‌ సర్కార్‌ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. 

బుధవారం భగత్ సింగ్ బలిదానం చేసిన రోజైన షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా ఖట్కర్ కలాన్‌లో సీఎం మాన్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల విగ్రహాల వద్ద నివాళి అర్పించిన అనంతరం పంజాబ్‌లో అవినీతిపరుల ఆట కట్టించేందుకు యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నంబర్‌(9501200200)ను సీఎం ప్రకటించారు. అందులో భాగంగానే యాంటీ కరప్షన్ యాక్షన్ లైన్ పేరుతో ఒక వాట్సాప్ నంబర్‌(9501200200)ను విడుదల చేశారు. 

ఈ క్రమంలో ఆయన ట్విట్టర్‌ ఓ వీడియో పోస్ట్‌ విడుదల చేశారు. పంజాబ్‌లో ఎవరైనా లంచం అడిగినా, మరేదైనా అవినీతికి పాల్పడినట్లు ప్రజల దృష్టికి వస్తే ఈ వాట్సాప్ నంబర్‌కు వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసి పంపించాలన్నారు. అనంతరం సీఎం పర్యవేక్షణలో ఉన్న ఓ టీమ్‌ వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పంజాబ్‌ను అవినీతిమయం కాకుండా కాపాడుకుందామని సీఎం పిలుపునిచ్చారు. పంజాబ్‌ను అవినీతి రహితం చేస్తే అదే మనం స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చి నివాళి అంటూ వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు