పంజాబ్‌ సీఎం సంచలన నిర్ణయం.. ఫిదా అవుతున్న ప్రతిపక్ష నేతలు

26 Mar, 2022 14:45 IST|Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆప్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకొని వార్తల్లో నిలిచింది. సీఎంగా భగవంత్‌ మాన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక ప్రకటనలు చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజాగా మాన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు.

అయితే, ఇక నుంచి మాజీ ఎమ్మెల్యేల‌కు కేవ‌లం ఒక్క ట‌ర్మ్‌కు మాత్ర‌మే పెన్ష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం మాన్‌ శనివారం ఓ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. పంజాబ్‌లో ఓ ఎమ్మెల్యే ఒక్క సారి గెలిచినా లేదా రెండు, మూడు, నాలుగు, అయిదుసార్లు గెలిచినా వారికి ఒకే ఒక్క ట‌ర్మ్‌లో మాత్రమే పెన్ష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా చాలా మంది ఎమ్మెల్యేలు లక్షల్లో పెన్షన్‌ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు 3.50 ల‌క్ష‌లు- 5.25 లక్షల వరకు పెన్షన్‌ తీసుకుంటున్నారని.. ఇది ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఒక్క‌సారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్య‌క్తికి పంజాబ్‌లో నెల‌కు 75వేల పెన్ష‌న్ ఇస్తున్నారు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. పెన్షన్‌ డబ్బుకు అదనంగా మరో 66 శాతాన్ని అందజేస్తున్నారు. దీంతో అలా ఎన్ని సార్లు గెలిస్తే.. అన్ని సార్లు అమౌంట్ క‌లుపుతూ ఉంటారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారం అవుతోందని మాన్‌ తెలిపారు. కాగా, పంజాబ్‌లో ప్రస్తుతం 250 మంది ఎమ్మెల్యేలు పెన్షన్‌ తీసుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లో 11 సార్లు శిరోమణి అకాళీదల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ఇటీవల కీలక ప్రకటన చేశారు. తనకు వచ్చే పెన్షన్‌ను సామాజిక కార్యక్రమాలకు, బాలికల విద్యకు వాడుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ ఆయన పెన్షన్‌ తీసుకుంటే సుమార్‌ రూ. 5 లక్షలపైనే డబ్బులు వచ్చేవి. ఇక, భగవంత్‌ మాన్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేతలు సైతం స‍్వాగతించారు. కాంగ్రెస్‌ సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా.. సీఎం నిర్ణయానికి మద్దతిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు