ఇది ‘ఆప్‌ ఆద్మీ’ విజయం.. సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు

10 Mar, 2022 13:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. జాతీయ పార్టీలను తన స్టైల్‌లో చెక్‌ పెట్టింది. పంజాబ్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయిన నాటి నుంచి పంజాబ్‌ రాజకీయాలపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. పోలింగ్‌ విధానంలో ప్రజలనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలని వినూత్నంగా ఆలోచించి ఎన్నికల ఫలితాల్లో సక్సెస్‌ అయ్యారు. మంచి విద్య‌, ఆరోగ్యం, సుప‌రిపాల‌న అందిస్తామ‌ని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీకే పంజాబ్‌ ఓటర్లు ప‌ట్టం క‌ట్టారు. 

ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ గెలుపుపై ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా స్పందించారు. ఈ సందర్భంగా సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ఇది ‘ఆమ్‌ ఆద్మీ’ (సామాన్యుడి) విజయమని అన్నారు. కేజ్రీవాల్‌ పాలనా విధానాన్ని పంజాబ్‌ ప్రజలు ఆమోదించారని తెలిపారు. ఆప్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు. దేశ ప్రజలు సైతం కేజ్రీవాల్‌ ప్రభుత్వం తరహా పాలనను కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

మరోవైపు.. తాము యూపీ, గోవా, ఉత్తరాఖండ్‌లో కూడా పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపినట్టు తెలిపారు. అక్కడ కూడా ప్రజలు తమ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేశారని అన్నారు. ఆ రాష్ట్రాల్లో ఫలితాలు, పార్టీ పని తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు