భగత్‌ సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆప్‌ సర్కార్‌ ఆగ్రహం

15 Jul, 2022 19:44 IST|Sakshi

ఛండీగఢ్‌: భగత్‌ సింగ్‌పై వివాదాస్పద కామెంట్‌ చేశాడు పంజాబ్‌ ఎంపీ ఒకరు. సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీ స్థానానికి ఈమధ్యే ఎన్నికైన సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌(77) భగత్‌ సింగ్‌ను ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. 

సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌.. శిరోమణి అకాళీ దళ్‌(అమృత్‌సర్‌) చీఫ్‌ కూడా. ‘‘భగత్‌ సింగ్‌ యువకుడైన ఓ ఇంగ్లీష్‌ అధికారిని చంపాడు.సిక్కు కానిస్టేబుల్‌ ఛన్నన్‌ సింగ్‌నూ హతమార్చాడు. జాతీయ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఇప్పుడు చెప్పండి.. భగత్‌ సింగ్‌ ఉగ్రవాదా? కాదా?’’ అంటూ కామెంట్లు చేశాడు. ఖలిస్థానీ అనుకూల వ్యాఖ్యలు చేసే క్రమంలో.. ఇలా కామెంట్లు చేశాడు ఆయన. అయితే భగత్‌ సింగ్‌పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేం కాదు. 

స్వాతంత్ర్య సమరయోధుడు, వీరుడైన భగత్‌సింగ్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని ఆప్‌ ప్రభుత్వం తప్పుబట్టింది. ఎంపీ వ్యాఖ్యలను హేయనీయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. మనోభావాలు దెబ్బతీసేలా, ఒక వీరుడ్ని అగౌరవపరిచేలా మాట్లాడినందుకు సిమ్రన్‌జిత్‌ యావత్‌ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. 

ఇదిలా ఉంటే.. పంజాబ్‌ రాజకీయాల్లో ఈయన వివాదాలకు కేరాఫ్‌. తాజాగా ఎంపీగా గెలిచిన వెంటనే ఖలీస్థానీ మిలిటెంట్‌ జర్నైల్‌ సింగ్‌ భింద్రావాలేకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని, కశ్మీర్‌లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్‌లో వినిపిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా.

మరిన్ని వార్తలు