ఢిల్లీలో పంజాబ్‌ హీట్‌.. అమిత్‌షాతో అమరీందర్‌ సింగ్‌ భేటీ

27 Dec, 2021 15:19 IST|Sakshi

న్యూఢిల్లీ‌: పంజాబ్‌లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్‌ రాజకీయాలు హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌ షా నివాసంలో.. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, సుఖ్‌దేవ్‌ సింగ్ ధిడ్సాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌, బీజేపీ, శిరోమణి అకాళిదళ్‌ పార్టీ(సాడ్‌)లో సంయుక్తంగా పోటీ చేయనున్నట్లు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌ సోమవారం ప్రకటించారు.  

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పంజాబ్‌ బీజేపీ ఇంచార్జీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే  కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిరోమణి అకాళిదళ్ కూడా బీజేపీతో కలవటం ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. కాగా,  మరికొద్ది రోజుల్లో ఆయా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున నాయకులు కలిసి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు , సీట్ల కేటాయింపులు, మేనిఫెస్టో తదితర అంశాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు.

అదే విధంగా షెకావత్‌ జలంధర్‌లో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పంజాబ్‌లో మళ్లీ స్వర్ణయుగం వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. పంజాబ్‌ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతివ్వాలో రైతులకు బాగా తెలుసన్నారు. కాగా, ఇటు కాంగ్రెస్‌ పార్టీ కూడా బీజేపీ చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొడుతుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఆప్‌ ఆద్మీ పార్టీ కూడా తమదైన శైలీలో  ప్రచారం నిర్వహిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు