Navjot Singh Sidhu: నిజం కోసమే నా పోరాటం: నవజోత్‌ సింగ్‌ సిద్ధూ

29 Sep, 2021 13:00 IST|Sakshi

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆగ్రహం

నా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటా..

అవినీతిపరులతో కూడిన వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చారు 

చండీగఢ్‌: పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌  కమిటీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన నవజోత్‌ సింగ్‌ సిద్ధూ  బుధవారం మౌనం వీడారు. తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని, అదే సమయంలో తన సిద్ధాంతాలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని చెప్పారు. పంజాబ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు(డీజీపీ), అడ్వొకేట్‌ జనరల్‌ నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కళంకిత నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టడం ఏమిటని నిలదీశారు.

ఈ మేరకు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ 4 నిమిషాల నిడివి గల ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపర్చడం, మార్పును తీసుకురావడమే తన ఆశయం, బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇదే తన ధర్మమని పేర్కొన్నారు. ఎవరిపైనా తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. తాను ఎవరితోనూ వ్యక్తిగతంగా పోరాడడం లేదని చెప్పారు. కేవలం పంజాబ్‌ అనుకూల ఎజెండా కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే దీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్నానని పేర్కొన్నారు. 

సత్యం కోసమే నా పోరాటం 
కేవలం సత్యమార్గంలో నడవాలని, నైతిక విలువల విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగాలని తన తండ్రి ఉద్బోధించాడని సిద్ధూ గుర్తుచేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ప్రీత్‌ సింగ్‌ సహోతాకు పంజాబ్‌ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన ప్రస్తావించారు. నైతిక విలువలు పాటించడంపై కొందరు రాజీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2015లో ఫరీద్‌కోట్‌లో గురు గ్రంథ సాహిబ్‌కు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, అందుకోసమే తాను పోరాటం ప్రారంభించానని చెప్పారు.

కొత్త అడ్వొకేట్‌ జనరల్‌గా ఏపీఎస్‌ డియోల్‌ను నియమించడంలోని ఔచిత్యాన్ని సిద్దూ ప్రశ్నించారు. గురు గ్రంథ సాహిబ్‌ను అవమానించిన కేసులో ఏపీఎస్‌ డియోల్‌ ఆరేళ్ల క్రితం అప్పటి పాలకుడు బాదల్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చారని, అలాంటి వ్యక్తికి అదే కేసులో న్యాయం చేకూర్చే బాధ్యతను ఎలా అప్పగిస్తారని అన్నారు. అవినీతిపరులైన నేతలు, అధికారులతో కూడిన వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చారని మండిపడ్డారు. దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని వివరించారు. 

కలిసి మాట్లాడుకుందాం..
రాష్ట్రంలో ప్రభుత్వ నియామకాలపై ఏమైనా అసంతృప్తి ఉంటే కూర్చొని చర్చించుకోవాలని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఫోన్‌ చేసి మాట్లాడారు. పంజాబ్‌లో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేదని కలిసి, అందరూ కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమైపోతుందని అన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అహం అడ్డు రాదని వ్యాఖ్యానించారు.  

అవినీతిపరులను తొలగించాలి: కేజ్రీవాల్‌ 
పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఒక తమాషా వ్యవహారంగా మార్చేశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సీనియర్‌ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు. పంజాబ్‌ కేబినెట్‌ నుంచి అవినీతిపరులను తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. 
చదవండి: పంజాబ్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

మరిన్ని వార్తలు