ఖమ్మంలో బండి సంజయ్‌ వ్యాక్సిన్‌లు పనిచేయవు

10 Jan, 2021 12:51 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖమ్మం పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధీటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ మంత్రి పదవి ఆశించలేదు. ఎన్నికల సమయం కావడంతో కొందరు టూరిస్ట్‌లు వస్తుంటారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చింది. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తొండి సంజయ్‌. కార్పొరేషన్‌ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రాబట్టుకోవడం కోసమే ఆయన పర్యటించారు. టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగించాం అనే వ్యాఖ్యలకు సమాధానంగా.. ఖమ్మంలో ఎటువంటి వ్యాక్సిన్‌లు పనిచేయవు. వ్యాక్సిన్‌ వేసినా తిప్పికొట్టేందుకు ఇక్కడ ప్రజలకు బాగా రోగ నిరోధక శక్తి ఉంది. కూకట్‌పల్లి డివిజన్‌లో ఏడు కార్పొరేటర్లలో ఆరు గెలుచుకొని బండి సంజయ్‌కు నేను వ్యాక్సిన్‌ వేశాను' అని పేర్కొన్నారు. చదవండి: (‘టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగించాం’)

దమ్ముంటే ఇప్పుడు నిరూపించు
లక్షలాదిమంది ప్రజలకు మమత ఆస్పత్రి ద్వారా సేవలందిస్తున్నాం. అలాంటి ఆస్పత్రిపై సంజయ్‌ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. సంజయ్‌ కార్పొరేటర్‌ కాక ముందే మమత ఆస్పత్రి ఏర్పడింది. ఆ విషయం సంజయ్‌ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నాపై చేసిన ఆరోపణలు 2023వరకు కాదు.. దమ్ముంటే ఇప్పుడు నిరూపించు అంటూ సవాల్‌ విసిరారు. నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు. ఖమ్మం జిల్లాలో మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. బీజేపీ మాకు పోటీనే కాదు. ఖమ్మంకు స్మార్ట్‌ సిటీ కావాలని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగాం. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఖమ్మంను స్మార్ట్‌ సిటీగా ప్రకటించలేని బీజేపీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు' అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ మండిపడ్డారు.  చదవండి: (12న రాష్ట్రానికి వ్యాక్సిన్లు)

మరిన్ని వార్తలు