ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్‌: ఆర్‌. కృష్ణయ్య

31 Aug, 2020 03:07 IST|Sakshi

ముషీరాబాద్‌ (హైదరా బాద్‌): ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఆదివారం బీసీ భవన్‌లో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్, 12 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా మూడేళ్ల క్రితం తీసుకున్న 5.77 లక్షల దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తుదారులందరికీ రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. ఆ తర్వాత వాటిని పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. వెంటనే రుణాలు మంజూరు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ప్రతి బీసీ కులానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ చొప్పున 52 బీసీ కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న 12 బీసీ కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. పాత ఫెడరేషన్లకు, కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు