తొలిదెబ్బ.. ఫలించని హరీష్‌ ఎత్తుగడలు

10 Nov, 2020 17:34 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ కంచుకోటలో వికసించిన కమలం

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించి.. టీఆర్‌ఎస్‌కు ఊహించిన షాక్‌ ఇచ్చారు. సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై 1079 ఓట్ల మెజార్టీ సాధించి.. తొలిసారి చట్టసభకు ఎన్నికయ్యారు. ఇరు పార్టీల మధ్య హోరా హోరీగా సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ విజయం సాధించి... అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తితింది. ఈ విజయంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగిపోయారు. దుబ్బాక ఇచ్చిన తీర్పుతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్‌ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెండు దశాబ్ధాలుగా టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న దుబ్బాకలో  ఓటమి చెందడం ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు.

సానుభూతి పనిచేసిందా..?
టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి ఎంపికపై తొలినుంచి వ్యూహత్మకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అందరూ ఊహించిన విధంగానే సోలిపేట సుజాతను బరిలో నిలిపారు. స్థానిక అభ్యర్థి కావడంతోపాటు సానుభూతి కూడా కలిసొస్తుందని అందరూ ఊహించారు. దుబ్బాక చుట్టూ సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట వంటి స్థానాల్లో కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావు ఉండటంతో  ఉప ఎన్నిక విజయం ఖాయమనుకున్నారు. మరోవైపు ప్రచార బాధ్యతలన్నీ మొదటి నుంచి మంత్రి హరీష్‌ రావు దగ్గరుండి చూసుకున్నారు. దుబ్బాక అభివృద్ధి తన బాధ్యతంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కేవలం​ ఓట్ల సమయంలోనే ప్రజల్లో కనిపిస్తారని, దుబ్బాక అభివృద్ధికి టీఆర్‌ఎస్‌కే  ఓటు వేయాలని అభ్యర్థించారు. మరోవైపు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయినప్పటికీ దుబ్బాక ప్రజలు మార్పును కోరుకున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి రెండు సార్లు అసెంబ్లీకి, ఓసారి మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసి ఓటమి చవిచూసిన రఘునందన్‌కు ఈసారి అవకాశం కల్పించారు. వరుస మూడు పరాజయాలకు తోడు వ్యక్తిగతంగా కొంత సానుభూతి కలిసొచ్చింది.

ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ కూడా విడుదల కాకముందే రఘునందన్‌ దుబ్బాకలో వాలిపోయారు. స్థానిక అభ్యర్థి కావడంతో పాటు తొలినుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాడనే నమ్మకం విజయానికి దారి తీసింది. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ అతనికి మంచి గుర్తింపు ఉంది. టీవీ షోలతో పాటు.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. అనునిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తే నేతగా గుర్తింపు పొందారు. అనర్గళంగా మాట్లాడే తత్వంతో పాటు చొరవ ఉన్న నేతగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా న్యాయవాది కావడం రఘునందన్‌కు రాజకీయాల్లో మరింత కలిసొచ్చింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సుజాత బరిలో నిలవడం కూడా రఘునందన్‌కు కొంచె అనుకూలంగా మారింది. సుజాత డమ్మీ అభ్యర్థి అని, ఆమెను గెలిపిస్తే దుబ్బాక వచ్చే నిధులు కూడా సిద్దిపేట, సిరిసిల్లకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చేసిన ప్రచారం బాగా వర్కౌట్‌ అయ్యింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై ఆయన చేసే ఆరోపణలు, విమర్శలు ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లాయి.

దిమ్మతిరిగిపోయే ఫలితం..
ఇక దుబ్బాకలో ఓటమి అధికార టీఆర్‌ఎస్‌ ఊహించనిది. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావు దాదాపు రెండు నెలలకు పైగా అక్కడే మకాం వేసినప్పటికీ.. ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా గుర్తింపు పొందిన దుబ్బాక గడ్డపై కాషాయం జెండా ఎగరడం అంత సామాన్య విషయం కాదని, దాదాపు లక్ష మెజార్టీ ఖాయమని టీఆర్‌ఎస్‌ నేతలు తొలి నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రచారంలో హరీష్‌రావు అనేక మార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ ఉత్కంఠ బరిత పోరులో చివరికి విజయం బీజేపీనే వరించింది. తాజా విజయంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ఈ ఫలితంతో టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగిపోయిందని, భవిష్యత్‌లోనూ జరిగే ఎన్నికల్లో ఇదే తీరు ఫలితాలు పునరావృత్తం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి చెందడం ఇది తొలిసారి. గతంలో పాలేరు, నారాయణ్‌ఖేడ్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి స్థానంలోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.

మరిన్ని వార్తలు