డబుల్‌ బెడ్రూం ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించిన రఘునందన్‌రావు

25 Jun, 2022 11:05 IST|Sakshi

ప్రభుత్వం తేదీ ప్రకటించకున్నా గృహప్రవేశాలు చేయించిన ఎమ్మెల్యే

అర్హుల గుర్తింపు పూర్తికాకుండానే నిర్వహించారంటూ అధికార టీఆర్‌ఎస్‌ మండిపాటు

దుబ్బాక టౌన్‌: దుబ్బాకలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జాప్యం అవుతుండటంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు స్వయంగా రంగంలోకి దిగి పలువురు లబ్ధిదారులతో శుక్రవారం గృహప్రవేశాలు చేయించారు. అయితే ఎమ్మెల్యే చర్యపై అధికార టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. ఇంకా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండా... ఇళ్ల వద్ద పనులు పెండింగ్‌లో ఉండగానే ఎలా గృహప్రవేశాలు చేయిస్తారని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. 

ఉదయమే వందలాది మందితో కలిసి... 
శుక్రవారం ఉదయాన్నే డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్దకు వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో చేరుకున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు కొంద రు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేగా పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించడం, లబ్ధిదారులతో కలసి గృహప్రవేశాలు చేయించడం తప్పా అని ప్రశ్నించారు.

ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కలను సాకారం చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని రఘునందన్‌రావు చెప్పారు. తొలి విడతగా ఎంపిక చేసిన 180 మంది లబ్ధిదారులకు ఇళ్లను ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులంతా శనివారంలోగా గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. శనివారం కూడా కొందరు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తానన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. 

భారీ పోలీసు బందోబస్తు.. 
డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడికి వస్తే గొడవలు జరిగే ఆస్కారం ఉందని గ్రహించి పట్టణంలోని పలు ప్రధాన చౌరస్తాలలో భారీగా మోహరించారు. 

మరిన్ని వార్తలు