పైలట్‌ ప్రాజెక్టుకే పరిమితమా?

6 Oct, 2021 02:35 IST|Sakshi

దళితబంధుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రఘునందన్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలున్న హుజూరాబాద్‌లో దళితబంధు అమలుకు నిధులు పంపించారని, ఇతర నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు నిధులు ఇచ్చారా? పైలట్‌ ప్రాజెక్టు అమలుకే పథ కం ఉంటుందా? అని అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలు బాగా ఉన్నా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోందన్నారు.

రాష్ట్ర జనాభాలో 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దామాషా ప్రకారం కేబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అగ్రవర్ణాల్లోని పేదలకు, గిరిజనులకు, బీసీలకు.. దళితబంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చే ఆలోచన ఉంటే తెలియజేయాలన్నారు. దళితబంధుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉంటే .. కేంద్ర నిధుల కోసం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీఎంని రఘునందన్‌రావు కోరారు.  

దళితబంధు అవసరం ఉండేది కాదు.. 
గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ అమలు సరిగ్గా జరిగి ఉంటే దళితబంధు అమలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని టీఆర్‌ఎస్‌ సభ్యుడు మెతుకు ఆనంద్‌ విమర్శించారు. విశ్వం ఉన్నంత వరకు కేసీఆర్‌ను దళితులు గుర్తు పెట్టుకునే పథకం ఇది అన్నారు. దళితబంధు కింద ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు పెట్టుకోవడానికి అనుభవం అవసరమా?

లేక అనుభవం ఉన్న వారిని ఉద్యోగస్తులుగా పెట్టుకుని ఏర్పాటు చేసుకోవచ్చా? అన్న విషయంపై స్పష్టత కల్పించాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే చిరిగిపోయిన విస్తారిని కుట్టడానికి ఇంత కాలం పట్టింది. అందుకే తొలి టర్మ్‌లో దళితబంధు అమలు చేయలేకపోయాం అని ఆనంద్‌ పేర్కొనగా, కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలిపారు.  

దళితబంధు చట్టం తీసుకురావాలి.. 
దళితబంధు పథకాన్ని భవిష్యత్తులో పక్కాగా అమలు చేసేలా చట్టబద్ధత కల్పించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభలో ప్రస్తావించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కంటే మైనార్టీ అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. సభ్యులు కోరితే దళితబంధు చట్టం తీసుకొద్దామన్నారు. మైనార్టీల సంక్షేమంపై త్వరలో ప్రత్యేక చర్చ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సభను గురువారం ఉదయం 10గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.  

మరిన్ని వార్తలు