తీర్పు ప్రగతిభవన్‌ వరకు పోవాలి: రఘునందన్‌

10 Nov, 2020 19:55 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : ఉత్కంఠ బరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల పోరులో బీజేపీ అభ్యర్థ రఘునందన్‌రావు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌పై అనుహ్య రీతిలో గెలుపొంది.. గులాబీ దళానికి సవాలు విసురుతున్నారు. రానున్న ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితమే పునరావృత్తం అవుతుందని గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు సృష్టించినా.. దుబ్బాకలో కాషాయ జెండా ఎగరేశామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (తొలిదెబ్బ.. ఫలించని హరీష్‌ ఎత్తుగడలు)

ఇక ఈ ఫలితాలు ఎంతో చారిత్రాత్మకమైనవని విజేత రఘునందన్‌రావు అన్నారు. తనకు విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు. ఫలితాల అనంతరం సిద్దిపేటలో ఇందూరు కాలేజీ వద్ద రఘునందన్‌రావు సాక్షితో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తన గెలుపును అడ్డుకోవాడానికి టీఆర్‌ఎస్‌ నేతలు అన్ని విధాల ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అసెంబ్లీ వేదికగా వారి తీరును ఎండగడతానని అన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకుంటూ పోరాటం సాగిస్తామన్నారు. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం)

‘దుబ్బాక ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్సులు తెలుపుతున్నా . ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం . ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంచించామో గొంతె త్తామో అదే గడ్డ ఇచ్చిన తీర్పు ప్రగతి భవన్ వరకూ పోవాలి. రాష్ట్రంలో నిరంకుశ నియంత్రుత్వ పాలనకు చరమ గీతం పాడేలా రీ సౌండ్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్‌కు ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన నాయకుల్లా రా కలిసి రండి. ఏకమై పోరాడుదాం’ అని వ్యాఖ్యానించారు.   


 


 

మరిన్ని వార్తలు