రాహుల్‌, ప్రియాంక పర్యటన : హథ్రాస్‌లో హైటెన్షన్‌

1 Oct, 2020 13:53 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హథ్రాస్‌లో చోటుచేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో హత్యాచారానికి గురై చికిత్స పొందుతూ బాలిక మృతిచెందడం పట్ల విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అధికార యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల తీవ్రంగా విఫలమైందని విమర్శిస్తున్నాయి. మరోవైపు తాజాగా ఘటనపై యూపీ కాంగ్రెస్‌ విభాగం ప్రధాన నగరాల్లో నిరసన చేపట్టింది. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ బాధ్యురాలు ప్రియాంక గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ హథ్రాస్‌కు బయలుదేరారు. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం)

ఈ సందర్భంగా అక్కడ స్థానిక పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. బాధితురాలి గ్రామం చుట్టు భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ లోపలకి అనుమతించడంలేదు. రాహుల్‌, ప్రియాంక రాక సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున హథ్రాస్‌కు చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు వారికి పోలీసు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పర్యటనకు వీలేదని రాహుల్‌, ప్రియాంకను రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత హైటెన్షన్‌ నెలకొంది. తాజా పరిణామాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని, యోగీని వెంటనే సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని రాష్ట్రపతి పాలన విధించాలని మాయావతి కోరారు.

ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన ఆ దళిత యువతి(19)కి అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించింది. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. అర్థరాత్రి పూట రహస్యంగా అంత్యక్రియలు జరపడం ఏంటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

మరిన్ని వార్తలు