మోదీ ప్రసంగంపై రాహుల్ విమర్శలు.. అదానీ ఊసే లేదని సెటైర్లు..

8 Feb, 2023 21:28 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తాను సంధించిన ఒక్క ప్రశ్నకు కూదా మోదీ నోట నుంచి సమాధానం రాలేదని మండిపడ్డారు. అదానీ వ్యవహారం ఊసే లేదన్నారు.

మోదీ ప్రసంగంపై తాను నిరాశ చెందానని, కానీ దీని ఒక నిజం తెలిసిందన్నారు రాహుల్. అదానీని ఆయన కాపాడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ అదానీ తన స్నేహితుడు కాకపోతే దర్యాప్తు చేపడతామని మోదీ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బినామీ, షెల్ కంపెనీల ద్వారా రక్షణ రంగంలో జరుగుతున్న లావాదేవీల గురించి కూడా మోదీ మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. 

దేశ భద్రత, దేశ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కీలక సమస్యల గురించి కనీసం విచారణ అయినా చేపడతామని మోదీ చెప్పాల్సిందని రాహుల్ అన్నారు. కానీ ఆయన ఎందుకు చెప్పలేదో తనకు అర్థమైందని పేర్కొన్నారు.

పార్లమెంటులో మంగళవారం మాట్లాడిన రాహుల్.. అదానీ వ్యవహారంపై కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మోదీకి, అదానీకి సంబంధం ఏంటి? ఇద్దరు ఎన్నిసార్లు కలిశారు? ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు? అన్ని వ్యాపార రంగాల్లోకి ప్రవేశించి అదానీ ఎలా విజయం సాధించారు? అని రాహుల్ నిలదీశారు. అయితే మోదీ ప్రసంగంలో ఇందుకు సంబంధించి ఒక్క మాట కూడా లేదు.
చదవండి: పార్లమెంట్‌లో విపక్షాలను ఏకిపారేసిన మోదీ..

మరిన్ని వార్తలు