పెట్రోల్‌ ట్యాంక్‌లు నింపుకోండి.. ‘ఎన్నికల ఆఫర్‌ ముగుస్తోంది’: రాహుల్‌ గాంధీ

5 Mar, 2022 19:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో అన్ని దశల్లో పోలింగ్‌ ముగియనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ కూడా యూపీ చివర విడుత పోలింగ్‌తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చివరి దశ పోలింగ్‌కు రెండు రోజు ముందే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బీజేపీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

మరో రెండు రోజుల్లో యూపీ చివరి దశ పోలింగ్‌ ముగిస్తుందని ఈ క్రమంలో ముందస్తుగా పెట్రోల్‌ ట్యాంక్‌ను నింపుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం మళ్లీ పెట్రోలు రేట్లు అమాంతం పెరుగుతాయని సెటైర్లు వేశారు. ‘త్వరగా పెట్రోల్‌ ఫుల్‌ట్యాంక్‌ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్‌’ అయిపోతుంది’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిందని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లాక్ చేశాయని తెలిపారు.  వచ్చే వారం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచే అవకాశం ఉందని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడవ దశ(చివరి) పోలింగ్ సోమవారం ముగిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. దేశీయ ఇంధన ధరల పెరుగుదల అంతర్జాతీయ చమురు ధరల మీద ఆధాపడి ఉంటుంది. ఎందుకంటే సుమారు 85 శాతం చమురు అవసరాలను భారత్‌.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గత 118 రోజులు నుంచి భారత్‌లో ఇందన ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటం గమనార్హం​. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం వల్లనే చమురు ధరలు స్థిరంగా ఉ‍న్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు