ఉద్యోగాలేవీ?: రాహుల్‌

10 Aug, 2020 03:23 IST|Sakshi

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, లాక్‌డౌన్‌ విధించడం... ఈ మూడు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘ఉపాధి కల్పించండి’అనే నినాదంతో కాంగ్రెస్‌ యువజన విభాగం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాహుల్‌... మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘మోదీ ప్రధాని పదవి చేపట్టినపుడు ప్రతియేటా రెండో కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. స్వప్నాన్ని చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు.

ఎందుకిలా జరిగింది? తప్పుడు విధానాలే కారణం. నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, లాక్‌డౌన్‌... ఈ మూడు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వాస్తవమేమిటంటే ఇప్పుడు భారత్‌ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోంది’అని రాహుల్‌ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో ధ్వజమెత్తారు. అందుకే యూత్‌ కాంగ్రెస్‌ వీధులకు ఎక్కిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను యూత్‌ కాంగ్రెస్‌ లేవనెత్తడం సంతోషకరమన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్‌ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్‌ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమన్నారు.   

పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలి: శశిథరూర్‌
పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు కాంగ్రెస్‌ వేగవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ చుక్కాని లేని నావలా తయారైందని, సరైనా దిశానిర్దేశం కొరవడిందని వ్యతిరేక మీడియా కారణంగా ప్రజల్లో నెలకొంటున్న అభిప్రాయాన్ని అడ్డుకోవాలంటే.. వెంటనే అధ్యక్ష నియామకం జరగాలన్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే సామర్థ్యం రాహుల్‌ గాంధీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు.

ఒకవేళ రాహుల్‌ బాధ్యతలు స్వీకరించడానికి విముఖంగా ఉంటే... కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియను వెంటనే చేపట్టాలని శశిథరూర్‌ ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. తాత్కాలిక సారథిగా సోనియాగాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టి ఈనెల పదో తేదీతో ఏడాది అవుతుంది. సోనియా నిరవధికంగా ఈ బాధ్యతలు మోయాలనుకోవడం న్యాయం కాదని శశిథరూర్‌ అన్నారు. గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ వ్యవహరించలేకపోతోందని, సవాళ్లను స్వీకరించడం లేదనే ప్రచారానికి తెరపడాలన్నారు. రాహుల్‌ విముఖంగా ఉంటే... కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపొచ్చని అభిప్రాయపడ్డారు.  

ఇంకొంత కాలం సోనియా కొనసాగుతారు
కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం సోమవారంతో ముగిసినా మరికొంతకాలం ఆమె పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి తెలిపారు. సమీప భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా