తెలంగాణలో అక్కడి నుంచే రాహుల్ ‘భారత్‌ జోడో’ యాత్ర

4 Oct, 2022 09:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తెలంగాణ రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. టీపీసీసీ ఆధ్వర్యంలో రూపొందించిన పాదయాత్ర రూట్‌ మ్యాప్‌కు ఏఐసీసీ ఆమోదం లభించింది. ఈ రూట్‌ మ్యాప్‌ ప్రకారం రాహుల్‌ గాంధీ.. కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తారు.

అక్కడినుంచి మక్తల్, మహబూబ్‌నగర్‌ టౌన్, జడ్చర్ల, షాద్‌నగర్‌ల మీదుగా యాత్ర శంషాబాద్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి బార్కస్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బేగంబజార్, గాంధీభవన్, నాంపల్లి, విజయనగర్‌ కాలనీ, మాసాబ్‌ట్యాంక్, పంజగుట్ట, అమీర్‌పేట, మూసాపేట, కూకట్‌పల్లి, మియా­పూర్, పటాన్‌చెరు, ముత్తంగిల మీదుగా యాత్ర సంగారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్లనుంది. అనంతరం సంగారెడ్డి నుంచి జోగిపేట, పెద్దశంకరంపేట, మద్నూరుల మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశి­స్తుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణలో రూట్‌ మ్యాప్‌కు ఏఐసీసీ అనుమతి లభించడంతో టీపీసీసీ నేతలు రాహుల్‌ యాత్రకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమ­య్యారు. అందులో భాగంగానే సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, చార్మినార్‌ ప్రాంతంలో పర్యటించి యాత్ర మార్గాన్ని పరిశీలించారు. షెడ్యూల్‌ ప్రకా­రం ఈనెల 24న భారత్‌ జోడో యాత్ర తెలంగాణ­లో ప్రవేశించాల్సి ఉంది. అయితే, ఒకట్రెండు రోజు­లు షెడ్యూల్‌లో మార్పు ఉండవచ్చని, అక్టోబర్‌ 26 నుంచి ఏ రోజైనా రాహుల్‌ తెలంగాణలోకి వస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. 

కీలక సమావేశం..: భారత్‌ జోడో యాత్ర షెడ్యూల్‌పై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్‌ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి పార్టీ అగ్రనేతలు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, కొప్పుల రాజు సోమవారమే హైదరాబాద్‌కు వచ్చారు. తొలుత ఈ నాయకులు మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వెళ్లి ఏపీలో రాహుల్‌ యాత్రపై అక్కడి నేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకుని టీపీసీసీ ముఖ్యులతో భేటీ కానున్నారు. భారత్‌ జోడో యాత్రతో పాటు యాత్ర తర్వాత నిర్వహించనున్న ‘సంవిధాన్‌ బచావో మార్చ్‌’పై కూడా కాంగ్రెస్‌ నాయకులు చర్చించనున్నట్లు తెలిసింది.
చదవండి: మునుగోడు దంగల్‌: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ

మరిన్ని వార్తలు