సమతామూర్తి విగ్రహం.. మేడ్​ ఇన్​ చైనా?! ఆత్మ నిర్భర్​ కాదు.. మోదీ చైనా నిర్భర్​ అంటూ..

9 Feb, 2022 12:29 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద రెండో విగ్రహం(కూర్చున్న పొజిషన్​లో) రామానుజాచార్యను ఆవిష్కరించిన దేశ ప్రధాని మోదీ.. జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. ముచ్చింతల్​(శంషాబాద్​ దగ్గర) జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం.. టీఆర్​ఎస్​, బీజేపీల మధ్య మాటల తుటాలకు కారణమైంది. అయితే ఇప్పుడు అంశం దేశ రాజకీయాలకు చేరింది. సమతామూర్తి విగ్రహం ఆధారంగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మేడ్​ ఇన్​ చైనా కామెంట్లతో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు విసిరారు.  

సమతామూర్తి విగ్రహం చైనాలో తయారైంది. కాబట్టి, నవ భారతం.. ఆత్మ నిర్భర్​ కాదు.. చైనా నిర్భర్​(ఆధారపడడం) అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్​ భారత్​ అంటారు. కానీ, నవ భారతం చైనా మీద ఆధారపడుతోంది. సమతామూర్తి విగ్రహమే అందుకు నిదర్శనం. ఇది చైనా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించబడింది అంటూ రాహుల్​ గాంధీ ఆరోపిస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. కొన్ని నివేదికల ఆధారంగా రాహుల్​ గాంధీ ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 216 అడుగుల స్టాచ్యూ ఆఫ్​ ఇక్వాలిటీ(సమతామూర్తి విగ్రహం)ను చైనాకు చెందిన అయిర్సన్​(Aersun) కార్పొరేషన్​ రూపొందించింది. 2015 ఆగష్టులో కాంట్రాక్ట్​ను ఆ కంపెనీకి అప్పగించగా.. చైనాలోనే దాదాపు పని పూర్తైంది. సుమారు 1,600 భాగాలు చైనాలో తయారయ్యి.. ఇక్కడికి వచ్చాయి. అమరిక ప్రక్రియకు సుమారు 15 నెలలు పట్టింది. కాంట్రాక్టు బిడ్డింగ్‌ను గెలుచుకోవడానికి భారతీయ కంపెనీ కూడా పోటీలో నిలిచింది అని ఆ నివేదిక వెల్లడించింది. మరి రాహుల్​ ఆరోపణలపై.. బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

చైనా విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ బలంగా మాటల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు పార్లమెంటులో రాహుల్​ ప్రసంగిస్తూ.. చైనీయులకు వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై స్పష్టమైన దృక్పథం ఉందని, చైనా,పాకిస్తాన్‌లు ఏకతాటిపై రావడానికి భారతదేశం అనుమతించిందని, ఇది అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదమని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశపు విదేశాంగ విధానం ఏకైక అతిపెద్ద వ్యూహాత్మక లక్ష్యం.. పాకిస్తాన్ చైనాలను వేరుగా ఉంచడం. ఇది భారతదేశానికి ప్రాథమికమైనది. కానీ, మీరు(మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ..) ఏం చేశారు? వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు’’ అని లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.

మనమందరం జాతీయవాదులుగా చర్చిద్దాం. విదేశాంగ విధానంలో మన ప్రభుత్వం వ్యూహాత్మక తప్పులు చేస్తోంది. చైనాను తక్కువ అంచనా వేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు చైనాలో తయారైన సమతామూర్తి విగ్రహంతో చైనా నిర్భర్​ను ప్రదర్శిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు