ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ ‌గాంధీ

3 Mar, 2021 03:12 IST|Sakshi

న్యూఢిల్లీ: 1975లో దేశంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)ని విధించడం పొరపాటేనని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. తన నానమ్మ(ఇందిరాగాంధీ)కు ఆ విషయం తరువాత అర్థం అయిందన్నారు. ‘అప్పుడు జరిగింది పొరపాటే. కచ్చితంగా అది తప్పే. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే అప్పుడున్న పరిస్థితి మౌలికంగా వేరైనది. కాంగ్రెస్‌ ఏ సమయంలోనూ దేశ మౌలిక వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు’ అన్నారు. కార్నెల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసుతో సంభాషణ సందర్భంగా మంగళవారం రాహుల్‌ పై వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తాను కోరుకుంటున్నానని, అందువల్లనే యూత్‌ కాంగ్రెస్‌లో, విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో ఎన్నికలకు పట్టుబట్టానని రాహుల్‌ వివరించారు. కాంగ్రెస్‌ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌ అని, సమానత్వం కోసం నిలిచిన పార్టీ అని గుర్తు చేశారు. ‘దేశ వ్యవస్థీకృత విధి విధానాలను మార్చే ప్రయత్నం, వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం కాంగ్రెస్‌ ఎప్పుడూ చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ శక్తి కూడా కాంగ్రెస్‌కు లేదు. మా పార్టీ రూపుదిద్దుకున్న విధానం కూడా అందుకు అంగీకరించదు. అందువల్ల మేం చేయాలనుకున్నా.. ఆ పని చేయలేం’ అని విశ్లేషించారు. అందుకు వ్యతిరేకంగా, ప్రాథమికంగానే వేరైన విధానాలను అధికార బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) అవలంబిస్తోందన్నారు. 

చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ)

(నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం: రాహుల్‌ గాంధీ)

మరిన్ని వార్తలు