ఆ ఇద్దరి కోసమే వ్యవ‘సాయం’

14 Feb, 2021 04:16 IST|Sakshi
అజ్మీర్‌ జిల్లాలో రైతు ర్యాలీలో ట్రాక్టర్‌ నడుపుతూ రాహుల్‌ అభివాదం

కొత్త సాగు చట్టాల వెనుక ప్రధాని మోదీ ఉద్దేశం అదే

రాజస్తాన్‌ రైతు ర్యాలీలో రాహుల్‌

జైపూర్‌: వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. దేశంలో వ్యవసాయ రంగ వాణిజ్యం మొత్తాన్ని మోదీ తన ఇద్దరు స్నేహితులకు ధారాదత్తం చేయడానికే కొత్త సాగు చట్టాలను తీసుకువచ్చారని ఆరోపించారు. రాజస్తాన్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం రాహుల్‌ అజ్మీర్‌లోని రూపన్‌గర్హ్, నగౌర్‌లోని మక్రానాల్లో జరిగిన రైతు ర్యాలీల్లో పాల్గొన్నారు. రంగురంగుల రాజస్తానీ తలపాగా(సఫా)ధరించి రాహుల్‌ ర్యాలీలో ట్రాక్టర్‌ నడిపారు.

కొత్త సాగు చట్టాల్లో మొదటిది మండీ వ్యవస్థను దెబ్బతీయడానికి, రెండోది వ్యవసాయోత్పత్తుల నిల్వలపై నియంత్రణ తొలగించడానికి, మూడోది రైతులు తమ సమస్యలపై కోర్టులకు వెళ్లడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించినవి అని ఈ సందర్భంగా రాహుల్‌ పేర్కొన్నారు. ‘నిజాన్ని తెలియజెప్పడం నా బాధ్యత. వినడం, వినకపోవడం మీ ఇష్టం’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రైతులు, చిన్న, మధ్య వ్యాపారులు, కార్మికులు కలిపి దేశంలోని వ్యవసాయ వాణిజ్యంలో 40% వాటా కలిగి ఉన్నారు. మోదీ ఈ వాణిజ్యం మొత్తాన్ని తన ఇద్దరు దోస్తులకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వెనుక అసలు ఉద్దేశం ఇదే’అంటూ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు.

‘దేశ ప్రజలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నట్లు నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారు. కానీ, ప్రజలకు ఆయన ఇచ్చిన అవకాశాలు ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు అనేవి మాత్రమే’అని రాహుల్‌ పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారి కారణంగా దేశం తీవ్రంగా నష్టపోతుందని గత ఏడాది ఫిబ్రవరిలో కనీసం 15 సార్లు చెప్పాను. రైతులు, కార్మికులు, నిరుపేదలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న నా మాటలకు మీడియా.‘నన్ను రైతును కాదు, జాతి వ్యతిరేకి అంటూ ముద్రవేసింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 200 మంది రైతులకు నివాళిగా పార్లమెంట్‌లో నేను లేచి నిలబడి మౌనం పాటించా. బీజేపీ ఎంపీల్లో ఒక్కరూ అలా చేయలేదు’అని తెలిపారు.

మరిన్ని వార్తలు