2014 తర్వాతే ‘అదానీ మ్యాజిక్‌’

8 Feb, 2023 05:40 IST|Sakshi

న్యూఢిల్లీ:అదానీ–హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక మ్యాజిక్‌ జరిగి ప్రపంచంలో 609వ స్థానంలో ఉన్న వ్యాపారవేత్త అదానీ కాస్తా ఏకంగా రెండో స్థానానికి ఎగబాకారని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొని, మొదటి ప్రతిపక్ష నేతగా రాహుల్‌ ప్రసంగించారు. విదేశాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అదానీకే దక్కేందుకు ప్రధాని మోదీ సాయపడ్డారని ఆరోపించారు.

అదానీతో కలిసి ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు? మీరు వెళ్లొచ్చాక ఆ దేశాలకు అదానీ ఎన్ని సార్లు వెళ్లారు? మీతోపాటు వచ్చినప్పుడు ఎన్ని కాంట్రాక్టులు అదానీ పొందారు? అని అంటూ అదానీ, మోదీ ఉన్న ఫొటోలను ఆయన ప్రదర్శించారు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా గత 20 ఏళ్లలో బీజేపీకి ఎంత విరాళమిచ్చారో తెలపాలన్నారు. ‘‘భారత్‌ జోడో యాత్రలో ప్రతి చోటా అదానీ పేరే వినిపించింది. 2014–22 మధ్యలో అదానీ ఆస్తులు 8 బిలియన్‌ డాలర్ల నుంచి 140 మిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగాయని యువత నన్ను ప్రశ్నించారు. అదానీకి విదేశాల్లో నకిలీ కంపెనీలున్నాయని హిండెన్‌బర్గ్‌ పరిశోధనలో తేలింది. సీబీఐ, ఈడీ సాయంతో ముంబై ఎయిర్‌పోర్టును జీవీకే నుంచి లాగేసుకుని అనుభవం లేని అదానీ సంస్థకు కట్టబెట్టారు’’ అన్నారు. వీటిపై అధికార బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపాలన్నారు. మోదీ, అదానీ ఫొటోలను ప్రదర్శించినందుకు స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం భారీ కుంభకోణాలతో దేశ ప్రతిష్ట దెబ్బతిందని బీజేపీ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ మీడియాతో అన్నారు.

రాజస్తాన్‌ సంగతి చూసుకో: బీజేపీ
బీజేపీ సభ్యుడు సీపీ జోషి మంగళవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించారు. ప్రధాని మోదీ దేశాన్ని ఆధ్యాత్మికంగా, డిజిటల్‌గా ఐక్యంగా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. రాముడికి, మోదీకి సారూప్యతలున్నాయన్నారు. రాహుల్‌పై విమర్శనా్రస్తాలు సంధించారు. రాహుల్‌ ముందుగా రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ కుమ్ములాటలను చక్కదిద్ది తర్వాత దేశం విషయం ఆలోచించాలన్నారు. ప్రధాని పదవి కాపాడుకునేందుకే కాంగ్రెస్‌ దేశాన్ని విభజించిందని ఆరోపించారు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ బారి నుంచి తన పాతివ్రత్యాన్ని కాపాడుకునేందుకు మేవాడ్‌ రాణి పద్మావతి ఆత్మత్యాగం చేసుకున్నారన్న జోషి వ్యాఖ్యలపై దుమారం రేగింది. సతీసహగమన దురాచారాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెల్‌లోకి వెళ్లి నినాదాలకు దిగడంతో స్పీకర్‌ సభను 20 నిమిషాల సేపు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక, అభ్యంతరకర వ్యాఖ్యలుంటే తొలగిస్తామని స్పీకర్‌ హామీ ఇవ్వడంతో కార్యకలాపాలు కొనసాగాయి.

చదవండి: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. సీఎల్‌పీ నేత థోరట్ రాజీనామా

మరిన్ని వార్తలు