రాహుల్‌ వ్యాఖ్యలపై రగడ.. మహా వికాస్‌ అగాడీకి బీటలు?

20 Nov, 2022 06:12 IST|Sakshi

కూటమి మనుగడపై ప్రభావం: రౌత్‌

బ్రిటిషర్ల నుంచి సావర్కర్‌కు పెన్షన్‌

పీసీసీ చీఫ్‌ పటోలే వ్యాఖ్యలతో కాక

ముంబై: వీర సావర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్‌ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ గురువారం సావర్కర్‌పై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఆయన బ్రిటిష్‌ వారికి భయపడి క్షమాభిక్ష కోరారని, గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటిపై కాంగ్రెస్‌ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం మండిపడుతోంది.

ఇందుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్‌ అగాడీ నుంచి బయటికి వచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్‌ వ్యాఖ్యలను ఉద్ధవ్‌ ఠాక్రే వెంటనే ఖండించడం తెలిసిందే. మహారాష్ట్రులకు ఆరాధ్యుడైన సావర్కర్‌ వ్యతిరేక వ్యాఖ్యలను తాము సహించే ప్రసక్తే లేదని ఉద్ధవ్‌ వర్గానికి చెందిన నేత అరవింద్‌ సావంత్‌ కుండబద్దలు కొట్టారు. ఇటీవలే రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో నడిచిన ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తాజాగా అదే మాట చెప్పారు. రాహుల్‌ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఉద్ధవ్‌ వర్గం సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ కూడా శనివారం అభిప్రాయపడ్డారు.

అవి అగాడీ కూటమి మనుగడపై ప్రభావం చూపుతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కాకను మరింత పెంచేలా సావర్కర్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే శనివారం మరిన్ని విమర్శలు గుప్పించారు! బ్రిటిష్‌ వారి నుంచి సావర్కర్‌ రూ.60 పెన్షన్‌ తీసుకున్నారంటూ మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిపారు. రాహుల్‌ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు ముందుగా దీనికి బదులివ్వాలన్నారు. మరోవైపు ఉద్ధవ్‌కు సావర్కర్‌పై ఏ మాత్రం గౌరవమున్నా కాంగ్రెస్‌కు తక్షణం గుడ్‌బై చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రావ్‌సాహెబ్‌ దన్వే శనివారం డిమాండ్‌ చేశారు. ఆ ఉద్దేశముందో లేదో చెప్పాలని సవాలు చేశారు.

మరిన్ని వార్తలు