Rajasthan Congress Crisis: కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీకి పంపిన రాహుల్.. సాయంత్రం కీలక ప్రకటన!

26 Sep, 2022 11:16 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్‌, సచిన్‌ పైలట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. గహ్లోత్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే పార్టీ పరిశీలకునిగా వెళ్లిన మల్లికార్జున్‌ ఖర్గే, అజయ్‌ మాకెన్ వారితో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. అయితే గహ్లోత్ వర్గీయులు పైలట్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఎలాంటి పురోగతి  లేకుండానే చర్చలు ముగిశాయి. దీంతో ఖర్గే, అజయ్ మాకెన్ తిరిగి ఢిల్లీకి పయనమవుతున్నారు.

మరోవైపు రాజస్థాన్‌లో అనూహ్య పరిణామాలను రాహుల్ గాంధీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో భారత్‌ జోడో యాత్రలో ఉన్న ఆయన.. ఎమ్మెల్యేల రాజీనామా విషయం తెలియగానే హుటాహుటిన కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీకి పంపారు. ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధిష్ఠానం బావిస్తోంది. అసమ్మతి వర్గంలోని ఒక్కో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పరిశీలకులు ప్రత్యేకంగా చర్చించాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది.

అయితే ఎమ్మెల్యేలంతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ ఇళ్లకు వెళ్లారని, ఇవాళ ఎవరితోనూ భేటీ అయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైవు ఇవాళ సాయంత్రం సోనియా గాంధీతో కాంగ్రెస్ పరిశీలకులు, కేసీ వేణుగోపాల్‌ సమావేశం అవుతారని, ఆ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానంలో పైలట్‌ను కొత్త సీఎంగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే గహ్లోత్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ వర్గానికి చెందిన వారినే సీఎం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభానికి దారితీసింది.

బీజేపీ సెటైర్లు..
ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటుంటే.. మరోవైపు రాజస్థాన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చోడో అంటున్నారని బీజేపీ సెటైర్లు వేసింది. దేశాన్ని ఏకం చేయడం కాదు రాహుల్‌, ముందు మీ ఎ‍మ్మెల్యేలను ఏకం చెయ్ అని ఎ‍ద్దేవా చేసింది.
చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు