దేశంలో ఇక్కట్లకు హిందుత్వే కారణం

19 Dec, 2021 05:13 IST|Sakshi
పాదయాత్రలో పాల్గొన్న రాహుల్, ప్రియాంక

అమేథి ర్యాలీలో రాహుల్‌ విమర్శ

అమేథి: దేశంలో ధరల పెరుగుదల, బాధలు, విచారాలన్నింటికీ హిందుత్వే ప్రత్యక్ష కారణమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 2019లో ఓటమి అనంతరం శనివారం ఆయన రెండో మారు అమేథిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో హిందుత్వవాదుల వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ‘హిందువులు, హిందుత్వవాదులకు మధ్య పోరు నడుస్తోంది.

హిందువులు సత్యాగ్రహంపై నమ్మకం ఉంచగా, హిందుత్వవాదులు సత్తాగ్రహ్‌(రాజకీయ దురాశ)ను నమ్ముతున్నారు’ అని అన్నారు. పార్టీ నేత ప్రియాంక గాంధీతో కలిసి అమేథిలో ఆయన ఆరు కి.మీ.ల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగితపై మోదీ మాట్లాడరని, గంగలో మునకలు మాత్రం వేస్తారని ఎద్దేవా చేశారు. ‘హిందువులు కోట్లాదిమంది తోటివారితో కలిసి గంగలో స్నానాలు చేస్తుంటే, హిందుత్వ మాత్రం ఒంటరిగా గంగలో మునుగుతోంది’ అన్నారు.

కనీసం తోటి నాయకులకు తనతో కలిసి గంగాస్నానం ఆచరించే అవకాశాన్ని మోదీ ఇవ్వలేదన్నారు. కీలక అంశాల పైనుంచి ప్రజల దృష్టి  మళ్లించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్‌ వ్యూహాలు అవలంబిస్తోందని విమర్శించారు. గాంధీ హిందూ కాగా, గాడ్సే హిందుత్వ వాది అని విమర్శించారు. మోదీకి వ్యాపారవర్గాలపై ప్రేమ అని, నోట్ల రద్దు, సాగు చట్టాలు, జీఎస్‌టీ వంటివన్నీ వారి ప్రయోజనాల కోసమే తెచ్చారని దుయ్యబట్టారు. 2004 నుంచి అమేథిలో గెలుస్తూ వస్తున్న రాహుల్‌ను 2019లో స్మృతీ ఇరానీ ఓడించారు. నాటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన రాహుల్‌ కేరళలోని వయనాడ్‌లో గెలుపొందారు.

మరిన్ని వార్తలు