ఉపాధి కోసం యూత్‌ కాంగ్రెస్‌ ప్రచారోద్యమం

9 Aug, 2020 19:54 IST|Sakshi

మోదీ సర్కార్‌పై రాహుల్‌ గరం

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామన్న మోదీ సర్కార్‌ తన హామీని నిలబెట్టుకోకపోగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో కోట్లాది ఉద్యోగాలు కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పించండి (రోజ్‌గార్‌ దో) అంటూ 90 సెకన్ల నిడివి కలిగిన వీడియోను రాహుల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. నిరుద్యోగులు, యువత ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రచారోద్యమం చేపట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు.

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని యువతకు వాగ్ధానం చేశారని, అయితే మోదీ ప్రభుత్వ విధానాలతో 14 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి వీధినపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్‌డౌన్‌ వంటి తప్పుడు విధానాలతో ఈ పరిస్ధితి నెలకొందని విమర్శించారు. ఈ మూడు నిర్ణయాలతో ప్రభుత్వ దేశ ఆర్థిక​ మూలాలనే ధ్వంసం చేసిందని ఆరోపించారు. తిరోగమన నిర్ణయాలతో భారత్‌ ఇప్పుడు యువతకు ఉద్యోగాలు సమకూర్చే స్ధితిలో లేదనేది వాస్తవమని అన్నారు. తమ పార్టీ యువజన విభాగం యువతకు ఉద్యోగాలను కోరుతూ పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపడతుందని చెప్పారు. చదవండి : ఆ పదవికి రాహులైతేనే బెస్ట్‌

మరిన్ని వార్తలు