‘‘బీజేపీ హఠావో , కర్ణాటక బచావో’’ పిలుపు.. కాంగ్రెస్‌ వర్గపోరుపై రాహుల్‌ సీరియస్‌

3 Aug, 2022 15:16 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉంది. ఈలోపే కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ సీఎం.. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, కీలక నేత.. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వర్గీయుల మధ్య పోటాపోటీ మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేసులో ఈ ఇద్దరినీ హైలైట్‌ చేసే ప్రయత్నంలో ఇంటి పోరును రచ్చకీడుస్తున్నారు.  

ఈ తరుణంలో.. డ్యామేజ్‌కంట్రోల్‌కు కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగారు. పరిణామాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక పర్యటనలో ఆయన.. కాంగ్రెస్‌ సీనియర్లతో రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కర్ణాటక నుంచి బీజేపీని గద్దె దించడమే ధ్యేయంగా పని చేయాలంటూ సీనియర్లకు హితబోధ చేశారాయన. అంతేకాదు.. పార్టీ అంతర్గత వ్యవహారాలను, నాయకత్వ అంశాలను ప్రజావేదికల్లో చర్చించకూడదంటూ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కీలక సూచనే చేశారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీలో గత కొన్నాళ్లుగా ముసలం కొనసాగుతోంది. 

కాంగ్రెస్‌ మొత్తం కలిసి కట్టుగా 2023 ఎన్నికల కోసం పోరాడాలి. తెలిసో, తెలియకో కొందరు కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. దయచేసి ఎలాంటి ఉచ్చులో పడకండి. ఇంటా-బయట పార్టీ వ్యవహారాల గురించి భిన్న గొంతుకలు వినిపించకండి అంటూ నేతలను కోరారాయన. 

అలాంటిదేం లేదు
అయితే ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ మాత్రం పార్టీలో ఉన్నత పదవి(సీఎం పోస్ట్‌) కోసం కొట్లాట జరగడం లేదని, ఇదంతా మీడియా చేస్తున్న హడావిడినే అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ.. కాంగ్రెస్‌ నేత ఎస్‌ఆర్‌ పాటిల్‌ సీఎం పదవికి సరైన అభ్యర్థి అంటూ ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.  అయితే ఆయన(పాటిల్‌) అర్హతలు ఉన్నాయని మాత్రమే తాను అన్నానని, మీడియా దానికి వేరే అర్థం తీసిందని వివరణ ఇచ్చుకున్నారు. 

ఇదిలా ఉంటే.. కర్ణాటక పర్యటనలో భాగంగా.. రాహుల్‌ గాంధీ చిత్రదుర్గలోని మురుగమఠ్‌ను సందర్శించారు. కర్ణాటక ఓటు బ్యాంకింగ్‌లో లింగాయత్‌లకు 17 శాతం వాటా ఉండగా.. దానిని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాహుల్‌ ప్రధాని అవుతారంటూ మఠాధిపతి వ్యాఖ్యానించడం విశేషం.

భారీ ట్రాఫిక్‌ ఝామ్‌
సిద్ధరామయ్య పుట్టినరోజు వేడుకల సందర్భగా.. దావణగెరెలో భారీ ట్రాఫిక్‌ ఝామ్‌ అయ్యింది. పుణే-బెంగళూరు హైవేపై సమారు 6 కిలోమీటర్ల మేర వేల కొద్ది వాహనాలు నిలిచిపోయి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు