అమరవీరులను అవమానించడమే

1 Sep, 2021 06:20 IST|Sakshi

జలియన్‌ వాలాబాగ్‌ మెమోరియల్‌ ఆధునీకరణపై రాహుల్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలియన్‌వాలా బాగ్‌ మెమోరియల్‌ ఆధునీకరణ పనులను ‘అమరవీరులకు కలిగిన అవమానం’గా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. బలిదానం అంటే అర్ధం తెలియని వారే ఇలా అవమానించగలరని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘నేను అమరవీరుడి కొడుకును. అమరులకు కలిగిన అవమానాన్ని ఏ మాత్రం సహించబోను. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకోని వారు దీనిని అర్థం చేసుకోలేరు’ అని పేర్కొన్నారు. జలియన్‌ వాలాబాగ్‌ మెమోరియల్‌ సముదాయంలో ఆధునీకరణ పేరుతో చేసిన మార్పులు, చేర్పులు చరిత్రను నాశనం చేసేవిగా ఉన్నాయంటూ  వెల్లువెత్తుతున్న విమర్శలపై ఒక మీడియా కథనాన్ని మంగళవారం ఆయన ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు.

బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మార్పులు బ్రిటిష్‌ పాలన, జనరల్‌ డయ్యర్‌ పాల్పడిన అకృత్యాలను ప్రజలకు స్మరణకు తెచ్చేలా చేయడానికి బదులు..తుడిచేసేలా ఉన్నాయని కాంగ్రెస్‌ నేత జైవీర్‌ షేర్‌గిల్‌ ఆరోపించారు. ఆధునీకరించిన జలియన్‌ వాలాబాగ్‌ మెమోరియల్‌ సముదాయాన్ని శనివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. కొత్తగా చేపట్టిన మార్పులపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ విమర్శలు కురిపించగా అదే పార్టీకి చెందిన సీఎం అమరీందర్‌ మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. జలియన్‌వాలా బాగ్‌ మెమోరియల్‌ సముదాయం ఆధునీకరణ అనంతరం చూడటానికి చాలా బాగుందన్నారు. ఈ సముదాయంలో ఏఏ నిర్మాణాలను తొలగించారో  తనకు తెలియదన్నారు. రాహుల్‌ ట్విట్టర్‌లో విమర్శించిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు