రాహుల్ గాంధీ షాకింగ్ నిర్ణయం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం!

20 Sep, 2022 21:37 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. మధ్యలో విరామం తీసుకుని ఢిల్లీకి వచ్చే సూచనలు కన్పించడం లేదని పేర్కొన్నాయి. దీంతో గాంధీ కుటుంబేతరులే పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు సెప్టెంబర్ 30 చివరి తేదీ. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసేది, లేనిది ఆయన మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు శశిథరూర్, రాజస్థాన్ సీఎం ఆశోక్ గహ్లోత్ మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది. శశిథరూర్ ఇప్పటికే సోనియాను కలిసి పోటీ చేస్తానని చెప్పారని, ఆమె కూడా అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గాంధీల విధేయుడిగా ఉన్న గహ్లోత్‌కే సోనియా, రాహుల్‌ల మద్దతు ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,700 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం కేరళలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు.
చదవండి: గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన మోదీ అభిమానులు

మరిన్ని వార్తలు