ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం, బీజేపీకి సర్‌ప్రైజ్‌!: రాహుల్‌ గాంధీ

24 Sep, 2023 14:57 IST|Sakshi

న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయని, ఈ ఫలితాలు బీజేపీని ఆశ్చర్యానికి గురిచేయనున్నాయని వ్యాఖ్యానించారు. అదేవిధంగా కర్ణాటకలో తాము నేర్చుకున్న పలు ముఖ్య విషయాలు దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం విషయం తెలిసిందే. 
చదవండి: ఆ రైల్వే కూలీకి ఇద్దరు బాడీగార్డులెందుకు? పాక్‌స్తాన్‌ ఎందుకు బెదిరిస్తోంది?

ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో విజయానికి దగ్గరల్లో ఉన్నామని.. అక్కడ కూడా గెలుస్తామని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం బీజేపీకి కూడా తెలుసని.. కానీ బయటకు చెప్పడం లేదని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ గెలవకపోవడం అనే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.

కర్ణాటక ఎన్నికల్లో తాము ముఖ్యమైన గుణపాఠాన్ని నేర్చుకున్నామని రాహుల్‌ గాంధీ తెలిపారు. బీజేపీ.. ఎన్నికల్లో ప్రతిపక్షాల వాదనను ప్రజలకు చేరకుండా దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తుందని ఆరోపించారు. అందుకే కర్ణాటకలో బీజేపీ అంచనాలను దాటి పోరాడి గెలిచామని పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి ఇటీవల బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై మతపరమైన దూషణలను ప్రస్తావిస్తూ..రమేష్‌ బిధూరి, నిషికాంత్‌ దూబే వాంటి నేతలు విద్వేషాలను రెచ్చగొట్టి కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కులగణన దేశ ప్రజలకు అవసరమైన ప్రాథమిక విషయమని, దీనిని బీజేపీ కోరుకోవడం లేదని విమర్శించారు.  కాగా ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణతోపాటు మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు